Google Gemini : వారెవ్వా గూగుల్ జెమిని.. ఏకంగా తొమ్మిది భాషల్లో.. ఎలా పనిచేస్తుందంటే?

Google Gemini తాజాగా ఏఐ అసిస్టెంట్ జెమినీ మొబైల్ యాప్ ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఇది దేశంలోని యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇది తొమ్మిది భాషలను సపోర్ట్ చేస్తుంది..

Written By: NARESH, Updated On : June 18, 2024 8:23 pm

Google Gemini

Follow us on

Google Gemini : మొన్నటిదాకా ఆండ్రాయిడ్ వెంట పరుగులు తీసిన ప్రపంచం.. ఇప్పుడు కృత్రిమ మేథ పేరును కలవరిస్తోంది. మొదట్లో దీనిని ఓపెన్ ఏఐ కంపెనీ చాట్ జిపిటి ద్వారా తెరపైకి తీసుకువచ్చింది. ఆ తర్వాత గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇందులోకి ప్రవేశించాయి. దీనిపై ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ.. అనేక రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం అనేది అనివార్యం అవుతోంది. టెక్నాలజీ రంగంలో అతి పెద్ద సంస్థగా ఉన్న గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో జెమినీ పేరుతో అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్ ను సాంకేతిక ప్రపంచానికి పరిచయం చేసింది. దీని వాడకంపై రకరకాల విమర్శలు ఉన్నప్పటికీ.. గూగుల్ వాటిని సవరించుకుంటూ రకరకాల ఫీచర్లను జోడిస్తోంది. తాజాగా ఏఐ అసిస్టెంట్ జెమినీ మొబైల్ యాప్ ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఇది దేశంలోని యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇది తొమ్మిది భాషలను సపోర్ట్ చేస్తుంది..

” ఏఐ అసిస్టెంట్ జెమినీ మొబైల్ యాప్ ను భారతదేశంలో లాంచ్ చేసాం. దేశంలోని యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో తొమ్మిది స్థానిక భాషలను జోడించాం. గూగుల్ మెసేజెస్ లో జెమినిని కూడా ఉపయోగించుకోవచ్చు. వచ్చే రోజుల్లో మరింత అధునాతనమైన ఫీచర్లను జోడిస్తాం. వినియోగదారులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వాడకాన్ని సరికొత్తగా పరిచయం చేస్తామని” గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతి, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, ఉర్దూ భాషల్లో ఈ యాప్ సేవలందిస్తుంది.

తొమ్మిది భాషలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి.. నచ్చిన వాటిని యాక్సిస్ చేసుకోవచ్చు. ఏదైనా అంశం లేదా విభాగం గురించి శోధించాలంటే టైప్ చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్ ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఫోటో సహాయంతో సమాచారాన్ని పొందవచ్చు. అయితే ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వచ్చే రోజుల్లో ఐఫోన్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ యాప్ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని.. వచ్చే రోజుల్లో ఆధునీకికరిస్తామని గూగుల్ చెబుతోంది. అత్యంత మెరుగైన అదనపు సదుపాయాల కోసం జెమినీ అడ్వాన్స్ ను ఉపయోగించుకోవచ్చని గూగుల్ చెబుతోంది. కాకపోతే ఇది ప్రీమియం వెర్షన్ అని.. దీనికోసం యూజర్లు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రీమియం వెర్షన్ లో ఫైల్ అప్లోడ్ చేసే సౌలభ్యం ఉంటుంది. డాటా అనలైజ్ చేసే సౌకర్యం ఉంటుందని గూగుల్ వివరిస్తోంది.