https://oktelugu.com/

Google Deep Mind: గూగుల్ డీప్ మైండ్ కు 100 మంది ఉద్యోగుల లేఖ.. ఆ ఒప్పందాలు వద్దంటూ డిమాండ్..?

గూగుల్ డీప్ మైండ్ లో పని చేస్తున్న ఉద్యోగులు సంస్థకు బహిరంగ లేఖలు రాశారు. పలు ఒప్పందాలపై పని చేయడం ఆపేయాలని వారు కోరుతున్నారు.. ఇంతకీ అవి ఏంటంటే..

Written By:
  • Neelambaram
  • , Updated On : August 24, 2024 / 04:43 PM IST

    Google Deep Mind

    Follow us on

    Google Deep Mind: గూగుల్ డీప్ మైండ్ కంపెనీకి చెందిన ఏఐ ఉద్యోగులు దాదాపు 200 మంది ఆ కంపెనీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా వారు కొన్ని డిమాండ్లు చేశారు. సైనిక సంస్థలతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కోరుతూ బహిరంగ లేఖపై ఈ ఉద్యోగులంతా సంతకాలు చేసినట్లు టైమ్ మ్యాగజైన్ వెల్లడించింది. ఈఏడాది మే 16న ఈ లేఖ విడుదలైంది. గూగుల్ డీప్ మైండ్ నిర్వహించే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ సాంకేతిక యుద్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుందని, కానీ గూగుల్ యొక్క సొంత ఏఐ సూత్రాలను ఇది ఉల్లంఘించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ నింబస్ గా పిలువబడే ఇజ్రాయెల్ మిలటరీ గూగుల్ యొక్క రక్షణ ఒప్పందాన్ని, గాజాలో సామూహిక నిఘా, లక్ష్యం ఎంపికల కోసం ఏఐ ద్వారా వినియోగిస్తున్న వాటి వివరాలను ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ ఉద్యోగులు ఏఐ నైతికతను సమర్ధించారు. ఏఐ మానవాళికి పెద్ద ప్రమాదాలను తెచ్చి పెడుతుందని హెచ్చరించారు. ఇక సైనిక, ఆయుధ తయారీలో ఏఐ ప్రమేయం ఉంటే, ఇది తమ ప్రస్థానానికి విఘాతం కలిగిస్తుందని వారు అభిప్రాయ పడ్డారు. గతంలోనూ డీప్ మైండ్ కు చెందిన మాజీ ఉద్యోగులు ఈ విషయాన్ని నొక్కి చెప్పారు లేని ప్రమాదాన్ని తెచ్చుకోవద్దని హెచ్చరించారు.

    2014లో గూగుల్ డీప్ మైండ్ ను కొనుగోలు చేసినప్పుడు ల్యాబ్ లోని సాంకేతికత, సైనిక నిఘా ప్రయోజనాల కోసం ఉపయోగించబోమని హామీ ఇచ్చింది. డీప్ మైండ్ యొక్క ముఖ్య సూత్రాలు ఏంటంటే హాని కలిగించే అప్లికేషన్లపై పని చేయడం నిషిద్ధం. గూగుల్ క్లౌడ్ సేవల యొక్క సైనిక వినియోగం యొక్క దావాలను పరిశోధించడానికి, డీప్ మైండ్ సాంకేతికతకు సైనిక ప్రాప్యతను రద్దు చేయడానికి, భవిష్యత్తులో సైనిక అనువర్తనాలను నిరోధించడానికి కొత్త పాలనా సంస్థను ఏర్పాటు చేయాలని డీప్ మైండ్ యాజమాన్యాన్ని ఈ లేఖ ద్వారా కోరారు.

    ఆగస్ట్ 2024 నాటికి, ఉద్యోగుల సమస్యలపై గూగుల్ ఏ మాత్రం స్పందించలేదు, టైమ్ మ్యాగజైన్ తో ఓ ఉద్యోగి స్పందిస్తూ.. మేము మా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందనను పొందలేదు.. మా ఓపికను వారు పరీక్షిస్తున్నారు. వారి ప్రవర్తనతో మేం విసుగు చెందాం.. అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు గూగుల్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. మేం ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేస్తన్నప్పుడు, వినయోగదారులకు అందుబాటులో ఉంచేటప్పుడు అన్ని నిబంధనలు పాటిస్తామని తెలిపారు. మేం బాధ్యతను మరువం. అదే మా నిబద్ధత అని ఆయన తెలిపారు.

    అయితే గూగుల్ లో నింబస్ కు వ్యతిరేకంగా గతంలోనూ అసమ్మతి రేగింది. దీంతో ఈ ఏడాది ప్రారంభంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను గూగుల్ డీప్ మైండ్ తొలగించింది. ఇప్పుడు మరోసారి 100 మందికి పైగా ఉద్యోగులు బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. దీనిపై గూగుల్ డీప్ మైండ్ ఎలా స్పందిస్తుందోనని అంతా చర్చ జరుగుతున్నది. అయితే డీప్ మైండ్ నిబంధనల మేరకే తాము తమ ఆందోళనను లేఖ రూపంలో వివరించామని ఉద్యోగులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ లేఖాస్త్రం పని చేస్తుందో లేదో, ఏ మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.