Star Link Charges: ఎలన్ మస్క్ సంస్థ స్టార్‌లింక్ భారతదేశంలో తమ సర్వీసును ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుంచి దీనికి ఆమోదం లభించింది. ఈ ఏడాది చివర్లో లేదా 2026లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కిట్ ధర దాదాపు రూ.33,000 ఉంటుందని, నెలవారీ ప్లాన్ రూ.3,000 నుంచి రూ.4,200 వరకు ఉంటుందని సమాచారం. శాటిలైట్ టెక్నాలజీ కాబట్టి ఎక్కడి నుంచైనా హైస్పీడ్ ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు.
స్టార్‌లింక్ అనేది శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ అందించే సేవ. భూమికి తక్కువ ఎత్తులో తిరిగే వేలాది చిన్న ఉపగ్రహాల నెట్‌వర్క్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఈ ఉపగ్రహాలు భూమిపై ఉన్న యూజర్ టెర్మినల్స్(డిష్ లాంటివి) తో కమ్యూనికేట్ చేస్తాయి. తద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తాయి. సాధారణంగా ఫైబర్ లేదా మొబైల్ నెట్‌వర్క్‌లు అందుబాటులో లేని మారుమూల గ్రామాలు, పర్వత ప్రాంతాలు, తీర ప్రాంతాలు లేదా ఇతర భౌగోళికంగా కఠినమైన ప్రదేశాలలో నివసించే వారికి స్టార్‌లింక్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే, విపత్తుల సమయంలో, సంప్రదాయ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు దెబ్బతిన్నప్పుడు, స్టార్‌లింక్ వంటి శాటిలైట్ ఇంటర్నెట్ అత్యవసర సేవలకు కీలకం అవుతుంది.
Also Read: WhatsApp APK Scam: ఈ చలాన్ వచ్చిందని ఓపెన్ చేశాడు.. ఇతడిలా మీరూ కాకూడదు!
స్టార్‌లింక్ కిట్ ధర రూ.33,000, నెలవారీ ప్లాన్ రూ.3,000 నుంచి రూ.4,200 వరకు ఉండటం చాలా మందికి అధికంగా అనిపించవచ్చు. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే తక్కువ ధరలకే ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ , 5G మొబైల్ ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నందున, సాధారణ వినియోగదారులు స్టార్‌లింక్‌ను ఎంచుకునే అవకాశం తక్కువ. అయితే, హైస్పీడ్ ఇంటర్నెట్ అవసరమయ్యే వ్యాపారాలు, పర్యాటక రంగం, వ్యవసాయ రంగం, విద్యా వంటి రంగాలలో మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సంస్థలకు ఈ అధిక ధర కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. ముఖ్యంగా, కనెక్టివిటీ లేకపోవడం వల్ల వ్యాపారాలు కోల్పోయే అవకాశాలతో పోలిస్తే, స్టార్‌లింక్ అందించే ఇంటర్నెట్ సర్వీస్ చాలా విలువైనది.
భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్‌లో స్టార్‌లింక్‌కు పోటీగా వన్ వెబ్ (భారతీ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యంతో), రిలయన్స్ జియో వంటి సంస్థలు కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. పోటీ పెరిగితే భవిష్యత్తులో స్టార్‌లింక్ ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా, స్టార్‌లింక్ భారతదేశంలో ఇంటర్నెట్ యాక్సెస్ లేని ప్రాంతాలకు ఒక గొప్ప అవకాశం అందిస్తుంది. అధిక ప్రారంభ ఖర్చులు, నెలవారీ ఛార్జీలు ఉన్నప్పటికీ దీని స్పెషాలిటీ, అవసరాలు కావాల్సిన వినియోగదారులు ఉపయోగించే అవకాశం ఉంది.