Electric Scooters: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు హీరో మోటోకార్ప్ రెడీ అయింది. ఇప్పటిదాకా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే బ్యాటరీ ఖర్చుతో కలిపి ధర భారీగా ఉండేది. కానీ, ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే, హీరో మోటోకార్ప్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ విడా వచ్చే నెలలో తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడా VX2ను ఒక సరికొత్త విధానంలో మార్కెట్లో తీసుకురాబోతుంది. అదేంటంటే… మీరు స్కూటర్ కొనేటప్పుడు బ్యాటరీకి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. బ్యాటరీని అద్దెకు తీసుకోవచ్చు.
సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్కువ ఖర్చు అయ్యేది బ్యాటరీకే. దీంతో వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఈ సమస్యను పరిష్కరించడానికే హీరో విడా ఒక స్మార్ట్ ఆలోచనతో రాబోతుంది. అదే ‘బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్’ (BaaS) విధానం. దీని ప్రకారం మీరు స్కూటర్ కొనేటప్పుడు బ్యాటరీకి అయ్యే ఖర్చును స్కూటర్ అసలు ధరలో కలపరు. దీని వల్ల స్కూటర్ కొనేటప్పుడు మీరు చెల్లించాల్సిన మొత్తం సగానికి పైగా తగ్గుతుంది. బ్యాటరీకి సంబంధించిన ఖర్చులను మంత్లీ రెంటల్ రూపంలో పే చేయవచ్చు. మీ బడ్జెట్, మీరు స్కూటర్‌ను ఎంత వాడతారనే దాని ఆధారంగా వివిధ రకాల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలను జూలై 1న విడా అధికారికంగా వెల్లడించనుంది. ఇప్పటివరకు ఈ ‘బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్’ (BaaS) ప్రోగ్రామ్ కేవలం ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు మొదటిసారిగా ఒక హీరో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేయబోతుంది.
Also Read: TVS : ఓలాకు గడ్డుకాలం.. దీపావళికి ముందే టీవీఎస్ చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్
హీరో కొత్తగా రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు ‘విడా VX2’. ఈ స్కూటర్‌ను గతంలో టెస్టింగ్ సమయంలో గుర్తించారు. V2 మోడల్‌లో ఉన్నట్లుగానే చిన్న TFT డిస్‌ప్లే, స్విచ్‌గేర్‌లు ఉన్నాయి. ఈ కొత్త స్కూటర్‌ను అల్లాయ్ వీల్స్‌తో రిలీజ్ చేసే అవకాశం ఉంది. హీరో విడాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100కు పైగా నగరాల్లో 3600కు పైగా ఫాస్ట్-ఛార్జింగ్ స్టేషన్లు, 500 సర్వీస్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. స్కూటర్ బుకింగ్‌లు, డెలివరీల గురించి ప్రస్తుతానికి అధికారిక సమాచారం రాలేదు. అయితే, లాంచ్ తర్వాత వెంటనే బుకింగ్‌లు ప్రారంభం కావచ్చని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
హీరో విడా VX2 వెహికల్ బజాజ్ చేతక్ 3001, టీవీఎస్ ఐక్యూబ్, ఓలా S1 ఎయిర్ వంటి ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ‘బ్యాటరీ రెంటల్’ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో కొత్త విప్లవం తీసుకొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అవకాశం లభిస్తుంది. దీంతో ఎక్కువ మంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.