Digilocker: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా పోలీసులు వాహనాన్ని ఆపుతారు. లైసెన్స్ చూపమని అడుగుతారు. అప్పటికప్పుడు లైసెన్స్ కార్డు జేబులో ఉండదు. అలాంటప్పుడు పోలీసులు విధించే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంకు కి వెళ్తాం.. క్యాషియర్ పాన్ కార్డు నెంబర్ చెప్పాలి అంటాడు. లేకుంటే పాన్ కార్డు చూపించండి అని అడుగుతాడు. అప్పటికప్పుడు మన జేబులో పాన్ కార్డు ఉండదు. పర్స్ చెక్ చేసుకుంటే కనిపించదు. దీంతో లావాదేవీ ఆగిపోతుంది.. ఫలితంగా మరుసటి రోజు బ్యాంకుకు మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది.
ఇవేకాదు ఇలా రకరకాల సందర్భాల్లో మనకు గుర్తింపు కార్డులు లేదా డాక్యుమెంట్లు అత్యంత కీలకంగా మారుతాయి. ప్రతిసారి వీటిని మనం భౌతికంగా తీసుకెళ్లలేం. కొన్నిసార్లు ముఖ్యమైన వాటిని జేబులో పెట్టుకుని తిరగడం వల్ల, అవి పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటప్పుడు డిజి లాకర్ అనే యాప్ లో మనం వాటన్నింటినీ భద్రంగా దాచుకోవచ్చు. ప్రభుత్వం ప్రజల సౌలభ్యం దృష్ట్యా అందుబాటులోకి తీసుకువచ్చింది.
డిజి లాకర్ యాప్ ఆన్ లైన్ సైట్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇందులో పదో తరగతి మెమో నుంచి మొదలు పెడితే ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ గుర్తింపు కార్డు, ఇన్సూరెన్స్ కాగితాలు, ఆదాయపు ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు వంటి ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలను భద్రంగా దాచుకోవచ్చు. మనకు అవసరమైనప్పుడు ఎక్కడి నుంచైనా వాటిని అత్యంత సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. పైగా డీజి లాకర్ ను వాడడం అత్యంత సులభం.. ముందుగా ప్లే స్టోర్ లోకి వెళ్లి డిజీ లాకర్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. అందులో పేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్, ఫోన్ నెంబర్ వంటి వాటిని ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ పిన్ నమోదు చేసుకోవాలి. అనంతరం మన మొబైల్ కి వచ్చే ఓటిపిని ఎంటర్ చేస్తే అందులోకి లాగిన్ కావచ్చు. లాగిన్ అయిన తర్వాత అందులో రకరకాల సర్టిఫికెట్లు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అందులో సెర్చ్ బార్ పై క్లిక్ చేసి రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.. పది, ఇంటర్, డిగ్రీ ధ్రువపత్రాల జాబితాను తనిఖీ చేసుకోవచ్చు. విశ్వవిద్యాలయాన్ని ఎంచుకొని హాల్ టికెట్ నెంబర్, పాస్ అయిన సంవత్సరం ఎంటర్ చేస్తే చాలు మీ ధృవపత్రాలు కనిపిస్తాయి. పాన్, రేషన్ కార్డులు వంటి వాటిని కూడా సెర్చ్ చేసి డిజి లాకర్ యాప్ లో జత చేసుకోవచ్చు. ఇలా మీరు ఎటువంటి ధ్రువపత్రాలు భద్రపరుచుకున్నారో.. ఒక్కొక్కటిగా డిజి లాకర్ స్క్రీన్ పై కనిపిస్తాయి. కేవలం ప్రభుత్వానికి సంబంధించినవి మాత్రమే కాకుండా ఇతర డాక్యుమెంట్లు కూడా మాన్యువల్ గా జత చేసుకోవచ్చు. ఇందు లో ఏకంగా 1 జీబీ వరకు క్లౌడ్ డాటా లభిస్తుంది. దానిని పూర్తిగా ఉచితంగా వాడుకోవచ్చు.. ఆ తర్వాత మరింత డాటా కోసం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు పోలీసులు లైసెన్స్ కార్డు అడిగిన, బ్యాంకు అకౌంటెంట్ పాన్ కార్డు అడిగినా, బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు కండక్టర్ ఆధార్ కార్డు అడిగినా, ఇతర పనుల కోసం ధ్రువపత్రాలు కావలసి వచ్చినా.. వెంటనే డిజి లాకర్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ చేతిలో మొబైల్ లేకపోయినా వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ కావచ్చు.. డాక్యుమెంట్లను సులువుగా పొందొచ్చు. అంతేకాదు డిజి లాకర్ అకౌంట్ యాక్సెస్ చేసేందుకు నామిని పేరును కూడా సిఫారసు చేసుకోవచ్చు.