Auto pay: డిజిటల్ పేమెంట్లు తారాస్థాయికి చేరుతున్న నేపథ్యంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. ఖాతాల్లో ఉన్న డబ్బును ఇతరుల ఖాతాల్లోకి పంపించేందుకు అత్యంత వేగవంతమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే వీటిని అదునుగా చేసుకొని కొంతమంది సైబర్ మోసగాళ్లు వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు.. దీనికోసం “ఆటో పే” దర్జాగా పాడుకుంటున్నారు.
ఇలా చేస్తారు మోసం
ఓటిటి సంస్థలు, డిజిటల్ పేమెంట్ ఈ యాప్ లు, ఈ కామర్స్ వెబ్ సైట్ లు చెల్లింపుల కోసం ఆటో పేను ఉపయోగిస్తుంటాయి. వీటిని ఆసరాగా తీసుకున్న సైబర్ మోసగాళ్లు వినియోగదారులకు మోసపూరితమైన మెసేజ్ లను పంపిస్తున్నారు. ఎలాగూ ప్రతినెలా ఆటో పే ద్వారా చెల్లింపులు చేస్తున్నామని భావించిన వినియోగదారులు.. సైబర్ మోసగాళ్ళు పంపించిన ఆటో పే ను కూడా నిజమే అనుకొని భావించి.. దానికి పేమెంట్ చెల్లిస్తున్నారు. ఒక్కసారి ఇలా పేమెంట్ చేస్తే చాలు.. మొత్తం సైబర్ ముఠా చేతుల్లోకి నగదు వెళ్లిపోతుంది.
సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడలు
డిజిటల్ పేమెంట్స్ విషయంలో.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నది. అయినప్పటికీ సైబర్ నెరగాళ్లు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. అడ్డగోలుగా మోసాలకు పాల్పడుతున్నారు. ఆటో పే ద్వారా ఇటీవల చెల్లింపుల విధానం పెరిగిన నేపథ్యంలో మోసగాళ్లు దీనిని వారికి అనుగుణంగా మలచుకుంటున్నారు. డిజిటల్ పేమెంట్ విషయంలో చాలామంది తమ ఫోన్ నెంబర్లను యూపీఐ ఐడి లుగా ఉంచుకుంటున్నారు. ఇటువంటి వారిని సైబర్ మోసగాళ్లు సులువుగా టార్గెట్ చేస్తున్నారు. ఫోన్ నెంబర్ ఉన్న యూపీఐ ఐడి లకు సైబర్ నేరగాళ్లు రకరకాల సందేశాలు పంపిస్తున్నారు. ఇందులో ఒక్క మెసేజ్ కు రెస్పాండ్ ఐనా చాలు ఖాతా మొత్తం ఖాళీ అవుతుంది..
జాగ్రత్తగా ఉండాలి
ఇలాంటి సందర్భాల్లో డిజిటల్ పేమెంట్లు ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. డబ్బులు పంపించే సమయంలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కు యూపీఐ ని ఇంటర్ లింక్ చేసుకోకపోవడమే మంచిది. దీనికంటే తక్కువ బ్యాలెన్స్ ఉండే ఎకౌంటు నెంబర్ వాడటం చాలా మంచిది. తక్కువ స్థాయిలోనే వాలెట్లు ఉపయోగించాలి. అన్నిటికంటే ఆటో పే మెసేజ్ వచ్చినప్పుడు.. అలాంటి వాటికి స్పందించకపోవడమే మంచిది. యూపీఐ ఐడీలుగా మొబైల్ నెంబర్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. మెసేజ్ రాకుండా సాధ్యమైనంతవరకు సెట్టింగ్స్ మార్చుకుంటూ ఉండాలి. యూపీఐ పిన్ విషయంలో నాలుగు అంకెలకు బదులుగా 6 అంకెలను ఉపయోగించాలి. సాధ్యమైనంతవరకు పిన్ నంబర్ ఎవరికి చెప్పకూడదు. కనీసం షేర్ కూడా చేయకూడదు.