Artificial Intelligence Revolution: సరిగ్గా కొద్ది రోజుల క్రితం.. ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. వాస్తవానికి ఆ వీడియో టెక్నాలజీని అలా కూడా వాడుకోవచ్చా అని అనుకునేలా చేసింది. ఓ యువకుడు ఆకలిగా ఉందని ఒక పండ్ల దుకాణానికి వెళ్ళాడు. అక్కడ అతడికి ఒక పుచ్చకాయ ఆకర్షణీయంగా కనిపించింది. కాకపోతే అది మంచిగుందో లేదో తెలుసుకోవాలని అనిపించింది. వెంటనే చాట్ జీపీటీ ఓపెన్ చేశాడు. అ పుచ్చకాయ ఫోటో తీసి పంపించాడు.. అంతే వెంటనే ఆ పుచ్చకాయ బాగోలేదని చెప్పింది. దీంతో వెంటనే అతడు దానిని కాకుండా వేరే దానిని కొనుగోలు చేశాడు. తద్వారా మోసపోకుండా ముందే జాగ్రత్త పడ్డాడు. ఈ ఉదాహరణ చాలు టెక్నాలజీ మనిషి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి.. మారుతున్న కాలానికి అనుకూలంగా టెక్నాలజీ కూడా అనేక మార్పులకు గురవుతోంది. ఈ మార్పులను ప్రజలు ఒడిసి పట్టినప్పుడే ప్రయోజనాలు సాధ్యమవుతాయి. ఇలాంటి ప్రయోజనాలను దేశ ప్రజలందరికీ అందించడానికి ముఖ్యంగా గ్రామీణ స్థాయి ప్రజలకు అందించేందుకు కేంద్రం సమాయత్తమైంది.
కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఏకంగా 10 లక్షల మంది ప్రజలకు కృత్రిమ మేధ మీద అవగాహన కల్పించడానికి కార్యక్రమాలను రూపొందిస్తున్నామని.. ఇవన్నీ కూడా ఉచితంగా చేపడతామని ప్రకటించారు. దీనిని బట్టి టెక్నాలజీని ప్రజలకు మరింత చేరువ చేయడానికి కేంద్రం కంకణం కట్టుకుందని అర్థమవుతుంది. ఎందుకంటే నేటి కాలంలో ప్రతిదీ కూడా టెక్నాలజీ ద్వారానే జరిగిపోతోంది. ఒకప్పుడు అంటే యూపీఐ చెల్లింపులు ప్రారంభమైన తొలి రోజుల్లో కొంతమందికి మాత్రమే డిజిటల్ విధానంలో లావాదేవీలు నిర్వహించడానికి అవకాశం ఉండేది. కానీ కరోనా తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. డిజిటల్ విధానంలోనే చెల్లింపులు చేసే పరిస్థితి ఏర్పడింది.. తద్వారా ఆ కాలంలో డిజిటల్ చెల్లింపులు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ప్రస్తుతం మనదేశంలో మారుమూల పల్లె నుంచి మొదలు పెడితే దేశ రాజధాని వరకు డిజిటల్ విధానంలోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రజలకు e- ఆర్థిక అక్షరాస్యత మీద కేంద్రం అవగాహన కల్పించడం వల్లే ఇది సాధ్యమవుతుంది. డిజిటల్ విధానంలో చెల్లింపులు జరపడం వల్ల అపకతవకలకు చెక్ పడుతోంది. అంతేకాదు పారదర్శకత పెరుగుతోంది.
Also Read: ఏఐలో ఇండియాను అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్రం పెద్ద ప్లాన్
డిజిటల్ విధానంలో చెల్లింపులు బాగానే ఉన్నప్పటికీ.. కొంతమంది మోసగాళ్లు ప్రజలను వంచిస్తున్నారు. రకరకాల విధానాలతో జనాలను ముంచుతున్నారు. ఇలాంటి వాటి నుంచి ప్రజలను కాపాడాలంటే కచ్చితంగా సాంకేతిక పరిజ్ఞానం మీద అవగాహన కల్పించాలి. నేటి కాలంలో కృత్రిమ మేధ అనేది అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంగా వెలుగొందుతోంది. ప్రస్తుతం దీని ద్వారానే అన్ని పనులు జరిగిపోతున్నాయి. చివరికి ఆర్థిక మోసాలను కూడా అరికట్టడానికి కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. అయితే మనదేశంలో సింహభాగం ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల మీదనే ఆధారపడి ఉంది. ఈ గ్రామీణ ప్రాంతాలలో టెక్నాలజీని గనుక బలోపేతం చేస్తే దేశం మరింత పురోగమిస్తుంది. ప్రజలలో తెలితేటలు మరింత పెరుగుతాయి. అవగాహన కలుగుతుంది. ఫలితంగా ప్రతి విషయంలోనూ పారదర్శకత ఏర్పడుతుంది.. ఆర్థిక అసమానతల నుంచి మొదలు పెడితే ఆరోగ్యాల వరకు అన్నింట్లోనూ ప్రభుత్వం అంచనా వేసిన పురోగతి కనిపిస్తుంది.. ఉదాహరణకు అమెరికాను తీసుకుంటే అక్కడ అత్యంత ఆధునికమైన వాషింగ్టన్ నుంచి మొదలుపెడితే మారుమూల గ్రామం వరకు ప్రజలు టెక్నాలజీని వాడుతూనే ఉంటారు. ఏదో ఒక రూపంలో దాని సేవలు పొందుతూనే ఉంటారు. తద్వారా అక్కడి ప్రజల జీవనశైలి అధునాతనంగా కనిపిస్తుంది.. అలాంటి జీవనశైలి ఇక్కడ కూడా సాధ్యం కావాలని కేంద్రం భావిస్తోంది. అందువల్లే కృత్రిమ మేధపై అవగాహన కల్పించడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఏకంగా 10 లక్షల మందికి ఉచితంగా అవగాహన కల్పించడానికి సిద్ధమైందంటే కేంద్రం ముందుచూపు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే మస్క్ కంపెనీకి శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించడానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. స్టార్ర్ లింక్ కూడా నగరాలను, పెద్దపెద్ద పట్టణాలపై కాకుండా.. గ్రామీణ ప్రాంతాల మీదనే దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాలలో అత్యంత తక్కువ ధరకు ఇంటర్నెట్ సేవలు అందించడానికి రంగం సిద్ధం చేసుకుంది. దీనిని బట్టి గ్రామీణ ప్రాంతాలలో సేవలు అందించడానికి ఏ స్థాయిలో అవకాశం ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ లింక్ ద్వారా మారుమూల గ్రామాలకు కూడా ఇంటర్నెట్ సేవలు అందిస్తాయి అక్కడ సమూలంగా మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రజల జీవన విధానాలు పూర్తిగా మారుతాయి. వినియోగ వ్యవస్థ మారుతుంది. ప్రజల అవసరాలలో కూడా మార్పు కనిపిస్తుంది. అప్పుడు కొత్త కొత్త అవకాశాలు ఏర్పడుతుంటాయి. ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడుతుంటాయి. తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తగ్గుతుంది. ప్రజల జీవనశైలి పూర్తిగా మారుతుంది. ప్రభుత్వం కోరుకునే కూడా ఇదే కాబట్టి అందువల్లే టెక్నాలజీ మీద ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించడానికి ముందుకు వచ్చింది.