Youtube: స్మార్ట్ ఫోన్ వాడే అందరికీ యూట్యూబ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మనిషి జీవితంలో అత్యంత గాఢంగా అల్లుకుపోయింది యూట్యూబ్. ఇందులో సమస్త సమాచారం లభిస్తుంది. రాజకీయాల నుంచి మొదలు పెడితే సినిమాల వరకు అన్ని యూట్యూబ్ లోనే దర్శనమిస్తుంటాయి. ఒకప్పుడు కొందరికి మాత్రమే పరిమితమైన యూట్యూబ్.. ఇప్పుడు అందరికీ చేరువ కావడంతో.. అత్యంత బలమైన సామాజిక మాధ్యమం లాగా అవతరించింది.
ప్రస్తుత సాంకేతిక ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊపేస్తోంది. అది యూట్యూబ్ లోకి కూడా ప్రవేశించింది. ఇప్పుడు దానిని కూడా షేక్ చేస్తోంది.. యూజర్ల సౌలభ్యం కోసం యూట్యూబ్ జంప్ అ హెడ్, ఆస్క్ పేరుతో రెండు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను అందుబాటులో తీసుకొచ్చింది.
జంప్ అ హెడ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యూట్యూబ్ తీసుకొచ్చిన సాలభ్యం ఇది. యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నప్పుడు.. మనకు నచ్చనవి వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేస్తుంటాం. తాజాగా తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ఇలాంటి సమయంలో అద్భుతంగా ఉపకరిస్తుంది. ఈ ఫీచర్ వల్ల ఫార్వర్డ్ చేయాల్సిన వీడియో భాగాలను మరింత సమర్థవంతంగా స్కిప్ చేసేందుకు అవకాశం ఉంటుంది.. అయితే ఈ ఫీచర్ ప్రీమియం సభ్యులకు మాత్రమే యూట్యూబ్ అందిస్తోంది. అంతేకాదు స్కిప్ చేసిన భాగాలను గుర్తించేందుకు ఈ ఫీచర్ మిషన్ లెర్నింగ్, వ్యూయింగ్ డేటాను తీసుకుంటుంది. యూజర్లు తమకు నచ్చిన విభాగాలకు వెళ్లే విధంగా పనిచేస్తుంది.
ప్రస్తుతం యూట్యూబ్ 10 సెకండ్ల ఇంక్రిమెంట్ అమలు చేస్తోంది. కొత్తగా వచ్చిన ఏఐ ఫీచర్ జంప్ అ హెడ్ ద్వారా వీడియోలు ముందుకు వెళ్లేందుకు రెండుసార్లు నొక్కాలి. ఆ తర్వాత ఒక బటన్ కనిపిస్తుంది. ఇది చాలా మంది వ్యూయర్స్ సాధారణంగా స్కిప్ చేసిన చోటుకు వెళ్లే దారి చూపిస్తుంది. పిల్ ఆకారంలో జంప్ అ హెడ్ బటన్ స్క్రీన్ కింద కుడివైపు మూలలో ఉంటుంది. దానిని వెంటనే ఉపయోగించకపోతే అది మాయమైపోతుంది. ఈ టెస్టింగ్ ప్రక్రియను మార్చిలో చేపట్టారు. అది విజయవంతం కావడంతో యూట్యూబ్ తన ప్రీమియం సబ్ స్క్రైబర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆస్క్
దీని ద్వారా యూజర్లు వీడియోలు చూస్తూ ప్రశ్నలను అడగొచ్చు. దీనిని అమెరికాలో 18 సంవత్సరాల వయసు ఉన్న యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అస్క్ ఫీచర్ ఉపయోగించే యూజర్లు కచ్చితంగా తమ అకౌంట్ కోసం దానిని ఎనేబుల్ చేసుకోవాలి. ఆపై అర్హత ఉన్న వీడియోల కింద ఆస్క్ బటన్ నిర్ధారించుకోవాలి. అనంతరం ప్రశ్నలు టైప్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అది సంబంధిత సమాధానాలు ఇస్తుంది. అయితే కొన్ని వీడియోలకు మాత్రం ఈ సౌలభ్యాన్ని యూట్యూబ్ ఇవ్వడం లేదు. అమెరికాలో 18 ఏళ్లు నిండిన యువతకే ఈ అవకాశాన్ని ఇస్తోంది. అంతకంటే తక్కువ వయసులో ఉన్న వారికి ఆస్క్ అనే అవకాశాన్ని కల్పిస్తే.. అది తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని యూట్యూబ్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ చెబుతోంది. అయితే ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసేవి కావడంతో .. యూజర్లకు యూట్యూబ్ సరికొత్త అనుభూతి ఇస్తోంది. అయితే వీటితోనే యూట్యూబ్ ఆగుతుందా.. ఇంకా భవిష్యత్తులో మరిన్ని మార్పులకు శ్రీకారం చుడుతుందా అనేది.. వేచి చూడాల్సి ఉంది.