AI Problems: రోబో సినిమా చూశారా.. అందులో రజనీకాంత్ humanoid robo ను రూపొందిస్తాడు. దానికి మనిషి మాదిరిగానే భావోద్వేగాలను ప్రదర్శించే విధంగా రూపకల్పన చేస్తాడు. ఆ తర్వాత అది అనేక దారుణాలకు పాల్పడుతుంది. చివరికి రజనీకాంత్ చేతుల్లో చనిపోతుంది. వాస్తవానికి యంత్రం యంత్రం మాదిరిగానే ఉండాలి. మనిషి మనిషి మాదిరిగానే ఉండాలి. కానీ ఇప్పుడు మనిషి యంత్రంలాగా మారిపోయాడు. చివరికి భావోద్వేగాల విషయంలో కూడా యంత్రం మీద ఆధార పడాల్సిన పరిస్థితి దిగజారాడు.
ప్రస్తుతం సాంకేతిక ప్రపంచం మనిషి జీవితాన్ని సమూల మార్పులకు గురిచేస్తోంది. ఇటీవల కాలంలో కృత్రిమ మేధ అనే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో మనిషి జీవితం పూర్తిగా మారిపోయింది. చిన్న చిన్న విషయాలకు కూడా కృత్రిమ మేధ మీద ఆధారపడాల్సిన దుస్థితి దాపురించింది. ఈ క్రమంలో కృత్రిమ మేధ వినియోగం అపరిమితంగా పెరిగిపోయింది. ఇటీవల కాలంలో యుద్ధ రంగంలో కూడా కృత్రిమ మేధను వినియోగించే స్థాయికి పరిస్థితి మారిపోయింది. ఇది ఎంతవరకు సబబు?.. ఎంతవరకు ఆమోదయోగ్యం? అనే విషయాలను పక్కన పెడితే.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధ చుట్టూ తిరుగుతోంది కాబట్టి తప్పడం లేదని నిపుణులు అంటున్నారు.
తెలియని విషయాలను తెలుసుకోవడానికి.. కొత్త విషయాలను అధ్యయనం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిందే. కాని చివరికి మానవ సంబంధాల విషయంలోనూ కృత్రిమ మేదను ఉపయోగించాల్సి రావడం అత్యంత బాధాకరం. ఇదే క్రమంలో కృత్రిమ మేధను చాలామంది చాలా రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. దీనివల్ల అనేక రకాల అనర్ధాలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు.. కృత్రిమ మేధను ఉపయోగించుకునే క్రమంలో ఒక ఐదు అంశాలను ఎట్టి పరిస్థితుల్లో దాని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయకూడదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
కృత్రిమ మేధను ఇటీవల చాలామంది వైద్యులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకుంటున్నారు. చివరికి దానిని వ్యక్తిగత వైద్యుడి లాగా మార్చేసుకుంటున్నారు. సాధ్యమైనంతవరకు సెకండ్ ఒపీనియన్ కోసం ఏఐ ని చాలామంది ఆశ్రయిస్తున్నారు. అది మంచి పరిణామం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కృత్రిమ మేధ చెప్పిన సమాచారాన్ని తెలుసుకొని చివరికి డాక్టర్ల మీదనే అబాండాలు వేసే స్థాయికి ప్రజలు పెరిగిపోయారు.
మానసిక సమస్యలు ఉన్నవారు కూడా ఇటీవల కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. చివరికి బలవన్మరణానికి ఎలా పాల్పడాలో కూడా కృత్రిమ మేధను అడుగుతున్నారు. ఇటీవల కాలంలో ఒక వ్యక్తి ఇదేవిధంగా చేసి తన తనువును బలవంతంగా చాలించుకున్నాడు. దీనిపై అతడి తల్లిదండ్రులు కోర్టు దాకా వెళ్లారు. ఆ కృత్రిమ మేధ ను అందుబాటులోకి తెచ్చిన సంస్థపై కేసులు కూడా వేశారు.
వ్యక్తిగత విషయాలను కూడా చాలామంది కృత్రిమ మేధ తో పంచుకుంటున్నారు. సాటి మనుషులతో మాట్లాడకుండా నిత్యం ఏఐతోనే గడుపుతున్నారు. తద్వారా తమలో ఉన్న భావోద్వేగాలను ఎదుటి మనిషితో పంచుకోలేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. కొన్ని సందర్భాలలో ఏఐ సరిగా పనిచేయలేకపోవడంతో ఒంటరితనంతో దారుణమైన నిర్ణయాలకు పాల్పడుతున్నారు.
ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారాన్ని కోరుతున్నారు. దీనివల్ల కొన్ని సందర్భాలలో దారుణంగా మోసపోతున్నారు. వాస్తవానికి కృత్రిమ మేధ అనేది మనిషి ప్రోగ్రామింగ్ ఇవ్వడం ద్వారానే పనిచేస్తుంది. అదేమి దేవుడు కాదు. దేవుడి మాదిరిగా భవిష్యత్తు ను ముందుగానే గుర్తించి చెప్పలేదు. ఆర్థిక వ్యవహారాలలో కృత్రిమ మేధను వాడి చాలామంది నిండా మోసపోతున్నారు.
స్టాక్స్ విషయంలో కూడా కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఆధారపడుతున్నారు. ఏ స్టాక్ విలువ పెరుగుతుంది? ఏ కంపెనీ స్టాక్ కొనుగోలు చేస్తే బాగుంటుంది? అనే విషయాలను కూడా ఏఐని అడుగుతున్నారు. మార్కెట్లో ఉన్న సమాచారం ప్రకారం ఏఐ సలహాలు ఇస్తోంది. వాస్తవానికి స్టాక్ మార్కెట్ అనేది రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఏఐ చెప్పడంతో చాలామంది గుడ్డిగా దానిని అనుసరించి నిండా మునిగిపోతున్నారు.
వ్యక్తిగత సంబంధాలు, వైద్యం, ఆర్థిక వ్యవహారాలు, మానసిక సమస్యలు, పెట్టుబడి మార్గాలు.. ఈ ఐదు అంశాలలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు. ఈ అంశాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద విపరీతంగా ఆధారపడితే చివరికి మునిగిపోక తప్పదని హెచ్చరిస్తున్నారు.