Instagram : ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫోన్ వెంట పరుగులు తీస్తోంది. అందులో ఉండే యాప్స్ లో మునిగి తేలుతోంది. ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో నూటికి 45% మంది తినేటప్పుడు, పడుకునేటప్పుడు మినహా మిగతా సమయం మొత్తం ఫోన్ చూస్తూ గడిపేస్తున్నారట. అందులో ఉన్న యాప్స్ లో కాలక్షేపం చేస్తున్నారట. కొత్త స్నేహితులను సృష్టించుకోవడం, వారితో మాట్లాడటం, ఇతర విషయాలను పంచుకోవడం వంటివి కొనసాగిస్తున్నారట. తెలియని వాటి గురించి తెలుసుకోవడం కూడా వాటి ద్వారానే చేస్తున్నారట.
యూజర్లను ఆకట్టుకునేందుకు..
యూజర్లు సోషల్ ప్రపంచంలో మునిగి తేలుతున్న నేపథ్యంలో.. యాప్స్ ను రూపొందించిన కంపెనీలు కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తున్నాయి. మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. వీటివల్ల యూజర్లకు సరికొత్త అనుభూతి కలగడం ఖాయమని చెబుతున్నాయి. అయితే ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ లో ఫేస్ బుక్, వాట్సాప్ తర్వాత ఆ స్థాయిలో ఇన్ స్టా గ్రామ్ యూజర్లను కలిగి ఉన్నది. ఫేస్ బుక్ లాంటి యాపే అయినప్పటికీ.. ఇది కాస్త భిన్నంగా ఉంటుంది.. మొదట్లో ఈ యాప్ కు యూజర్లు తక్కువగానే ఉన్నప్పటికీ.. క్రమక్రమంగా పెరగడం మొదలుపెట్టారు. పైగా దీనిని మెటా కంపెనీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో దీనికి అనేక సొబగులు అద్దుతోంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఫీచర్ ను ఇది అందుబాటులోకి తీసుకువచ్చింది. తొలిసారిగా మల్టీ ఆడియో ట్రాక్ ఆప్షన్ ను ప్రవేశపెట్టింది.
ఏమవుతుంది
మల్టీ ఆడియో ట్రాక్ ఆప్షన్ వల్ల యూజర్లు తమ రీల్స్ లో ఒకటి కంటే ఎక్కువ ట్రాక్ లను జల చేసుకోవచ్చు. అంతేకాదు ఇందులోనూ రకరకాల నేపథ్యాలు ఉన్న పాటలను ఎంచుకోవచ్చు. దీనివల్ల యూజర్లకు సరికొత్త రీల్స్ అనుభూతి లభిస్తుంద మెటా యాజమాన్యం చెబుతోంది. ఈ మల్టీ ట్రాక్ రీల్స్ ఫీచర్ ను ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి మెటా అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే భారత్ లో కొంతమంది యూజర్లకు ఇంకా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ” కొత్త ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. దీనివల్ల ఒకే రీల్ లో 20 వరకు ఆడియో ట్రాక్ లను యాడ్ చేసుకోవచ్చు. ఫలితంగా కంటెంట్ మరింత విభిన్నంగా ఉంటుంది. సృజనాత్మకతను జోడించేందుకు అవకాశం ఉంటుంది. యూజర్లు తమ ఆడియోను టెక్స్ట్ , స్టిక్కర్, క్లిప్స్ కు సరిపడా ఎంచుకోవచ్చు. దానివల్ల ఒక ప్రత్యేకమైన ఆడియోను సృష్టించేందుకు అవకాశం ఉంటుంది. దానిని సేవ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అలా ప్రత్యేకమైన ఆడియో ట్రాక్ లకు వారి పేరు మీద లేబుల్ చేస్తాం. వారికి క్రెడిట్ కూడా ఇస్తామని” ఇన్ స్టా అధిపతి ఆడం మొస్సెరి ప్రకటించారు.
డౌన్ లోడ్ ఇలా
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్ స్టా సరికొత్త వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అనంతరం ఆ యాప్ లో వీడియో ఎడిటర్ ఆప్షన్ క్లిక్ చేయాలి. యాడ్ మీ టూ మిక్స్ పై టాప్ చేయాలి. ఆ తర్వాత కావలసిన ట్రాక్ లను ఎంచుకోవాలి. ఒక ఆడియోలో కావలసిన భాగాన్ని కూడా ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంది. అనంతరం అది పూర్తయిన తర్వాత రీల్ వెంటనే లైవ్ లో దర్శనమిస్తుంది. దీనివల్ల యూజర్లకు సరికొత్త అనుభూతి లభిస్తుందని ఇన్ స్టా యాజమాన్యం చెబుతోంది.