Hydrogen Electric Power Aircraft : ప్రస్తుతం అన్ని రంగాలలో డ్రోన్ల వినియోగం పెరిగింది. వ్యవసాయం నుంచి మొదలుపెడితే రవాణా వరకు ప్రతీ విభాగంలో డ్రోన్ల వాడకం అనివార్యంగా మారింది. భవిష్యత్ కాలంలో డ్రోన్ ల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. మానవ కొరత ఉన్నా రంగాలలో డ్రోన్లు విరివిగా సేవలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఈ రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇన్నాళ్లపాటు వివిధ రకాల అడ్డంకులు ఉన్నప్పటికీ.. వీటిని త్వరలో అధిగమించే అవకాశం ఉంది. అయితే అమరావతిలో నిర్వహించిన డ్రోన్ సమ్మిట్ లో సాంకేతిక నిపుణులు సరికొత్త విషయాలను వెల్లడించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి డ్రోన్ తయారీదారులు వచ్చారు. వారు తమ రూపొందించిన డ్రోన్లను, దిగుమతి చేసుకున్న డ్రోన్లను, అభివృద్ధి చెసిన డ్రోన్లను ప్రదర్శించారు. అయితే ఇందులో కొన్ని ప్రాథమిక స్థాయిలో ఉంటే.. మరికొన్ని ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. ఇంకొన్ని టెస్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి. కొన్ని డ్రోన్లు వినియోగంలో ఉన్నాయి. అయితే ఇందులో మానవరహిత హెలికాప్టర్ ప్రత్యేకంగా కనిపించింది. దాని పేరు హైడ్రోజన్ ఎలక్ట్రిక్ పవర్ వీటీవోఎల్ ఎయిర్ క్రాఫ్ట్.. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుందంటే..
హైడ్రోజన్ ఎలక్ట్రిక్ పవర్ వీటీవోఎల్ ఎయిర్ క్రాఫ్ట్
ఇది చూసేందుకు హెలికాప్టర్ లాగా కనిపిస్తుంది. దీనిని సరుకు రవాణాకు ఉపయోగించవచ్చు. ఇది 100 కిలోల బరువు ఉన్న సరుకులను 300 కిలో మీటర్ల వరకు దర్జాగా రవాణా చేయగలుగుతుంది. నిర్దిష్ట ప్రదేశం నుంచే నేరుగా పైకి వెళ్తుంది. ముందుగా నిర్ణయించిన గమ్యస్థానం వరకు చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 45 నిమిషాల్లోనే.. ముంబై నుంచి పూణేకు 30 నిమిషాల్లోనే తీసుకెళ్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఎయిర్ టాక్సీ లలో మనుషులను తీసుకెళ్లడానికి అనుమతులు లేవు. అందువల్ల వీటిల్లో సరుకు రవాణా చేస్తున్నారు. 2025 కాలం నాటికి మానవ రహిత డ్రోన్లలో టన్ను పేలోడ్ బరువు ఉన్న సరుకులను ఉంచుతారు. వాటిని 800 కిలోమీటర్ల వరకు రవాణా చేయగలుగుతారు.. ఈ డ్రోన్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. ఇవే కాకుండా ఔషధాలను రవాణా చేయడానికి, నిత్యావసరాలను, సరుకులను వేగంగా బట్వాడా చేయడానికి డ్రోన్లను రూపొందిస్తున్నట్టు తయారీదారులు చెబుతున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్నాయట. అవన్నీ అందుబాటులోకి వస్తే డ్రోన్లలో నవశకం మొదలైనట్టే. ఏపీలో 300 ఎకరాలను డ్రోన్ సిటీ కోసం కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రకారం ఏపీ డ్రోన్ క్యాపిటల్ అయ్యే అవకాశాలు ఎంతో దూరంలో లేవు.