Zimbabwe Vs Scotland: ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ లో పెను సంచలనం..

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో జింబాబ్వే జట్టు అనూహ్యంగా ఓటమిపాలైంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.

Written By: BS, Updated On : July 5, 2023 11:04 am

Zimbabwe Vs Scotland

Follow us on

Zimbabwe Vs Scotland: జింబాబ్వే లోని హరారే వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. పసికూన జట్లు అగ్రశ్రేణి జట్లకు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే వెస్టిండీస్ జట్టు నెదర్లాండ్స్, స్కాట్లాండ్ చేతిలో ఓటమిపాలై.. వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే. తాజాగా జింబాబ్వే జట్టు కూడా అనూహ్యంగా వరల్డ్ కప్ కు అర్హత సాధించడంలో చతికిల పడిపోయింది. తాజాగా స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే 31 పరుగులు తేడాతో ఓటమిపాలై.. వరల్డ్ కప్ రేసు నుంచి నిష్క్రమించింది.

వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సంచలనాలకు కేంద్ర బిందువుగా క్వాలిఫైయర్ మ్యాచ్లు సాగుతున్నాయి. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన వెస్టిండీస్ జట్టును చిన్న జట్లు ఓడించి ఏకంగా వరల్డ్ కప్ టోర్నీకి దూరం చేశాయి. వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తుంది అనుకున్న జింబాబ్వే జట్టు కూడా అనూహ్యంగా వరల్డ్ కప్ ఆశలను వమ్ము చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో స్కాట్లాండ్ చేతిలో జింబాబ్వే జట్టు ఓటమిపాలు కావడంతో.. వరల్డ్ కప్ కు అర్హత సాధించకుండానే నిష్క్రమించినట్లు అయింది.

స్వల్ప లక్ష్యమే అయినా.. చతికిల పడిన జింబాబ్వే..

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో జింబాబ్వే జట్టు అనూహ్యంగా ఓటమిపాలైంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. స్కాట్లాండ్ ఆటగాళ్లు మెక్ బ్రిడే 45 బంతుల్లో 28 పరుగులు, మాధ్యు క్రాస్ 75 బంతుల్లో 38 పరుగులు, బ్రెండెన్ మెక్ ముల్లెన్ 34 బంతుల్లో 34 పరుగులు, మున్షి 52 బంతుల్లో 31 పరుగులు, మిచెల్ లీస్క్ 34 బంతుల్లో 48 పరుగులు, వాట్ 15 బంతుల్లో 21 పరుగులు చేసి రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి స్కాట్లాండ్ జట్టు 234 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు 203 పరుగులకు ఆల్ అవుట్ అయి. 31 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. జింబాబ్వే జట్టులో సికిందర్ రజా 40 బంతుల్లో 34 పరుగులు, ర్యాన్ బుర్ల 84 బంతుల్లో 83 పురుగులు, వెస్లీ మాదేవేరే 39 బంతుల్లో 40 పురుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్లు ఎవరూ రాణించకపోవడంతో 31 పరుగులు తేడాతో జింబాబ్వే జట్టు ఓటమిపాలైంది. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిష్ షోలే మూడు, బ్రెండన్ మెక్ ముల్లన్ రెండు, మైకేల్ లీక్ రెండు చప్పున వికెట్లు తీశారు. జింబాబ్వే బౌలర్లలో మూడు, చతారా రెండు వికెట్లు తీశారు.

దాదాపుగా దారులు మూసుకుపోయినట్లే..

వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడేందుకు నేరుగా ఎనిమిది జట్లు అర్హత సాధించగా, రెండు జట్ల కోసం క్వాలిఫైయర్ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. క్వాలిఫైయర్ మ్యాచ్ లు ఆడిన జట్లలో వెస్టిండీస్, జింబాబ్వే, శ్రీలంక, ఐర్లాండ్ జట్లలో రెండు జట్లు వస్తాయని అంతా భావించారు. ముఖ్యంగా ఐర్లాండ్ జట్టు లీగ్ దశలోనే క్వాలిఫైయర్ మ్యాచ్ల నుంచి నిష్క్రమించగా, వెస్టిండీస్ జట్టు గ్రూప్ సిక్స్ దశలో నిష్క్రమించింది. దీంతో శ్రీలంకతో పాటు జింబాబ్వే జట్టు వరల్డ్ కప్ మ్యాచ్లకు అర్హత సాధిస్తుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా స్కాట్లాండ్ చేతిలో జింబాబ్వే ఓటమి పాలు కావడంతో లెక్కలు మారాయి. శ్రీలంకతోపాటు వరల్డ్ కప్ కు స్కాట్లాండ్ జట్టు అర్హత సాధించే అవకాశాలు కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.