Yuvraj Singh and Shubman Gill: ఎడమ చేతి వాటం ద్వారా అతడు ఎందరికో సుపరిచితుడు. ఒక రకంగా టీమిండియాలో అతడు సూపర్ ఆల్ రౌండర్. ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించి.. టీమిండియా కు తొలి టి20 వరల్డ్ కప్ అందించాడు. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోను నెత్తురు కక్కుకుంటూ టీం ఇండియాను విజేతను చేశాడు. బ్యాటింగ్ మాత్రమే కాదు జట్టుకు అవసరమైన ప్రతి సందర్భంలోనూ వికెట్ తీశాడు. ఇక ఫీల్డింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. జాంటీ రోడ్స్ కూడా మురిసిపోయే విధంగా అతడు బంతులను ఆపేవాడు. అందువల్లే అతడిని టీమిండియా ప్రిన్స్ అని పిలిచేవారు.
అద్భుతమైన ఆట తీరు.. ఆకట్టుకునే దూకుడు ఉన్నప్పటికీ.. జట్టులో ఉన్న రాజకీయాల వల్ల అతడు నాయకుడు కాలేకపోయాడు. పైగా తన కెరియర్ ను అర్ధాంతరంగా ముగించాడు. వాస్తవానికి యువరాజ్ తో నాటి బోర్డు పెద్దలు ఆటాడుకున్నారు. ధోని కూడా తెర వెనుక కుట్రలు చేశాడని ఇప్పటికీ యువరాజ్ తండ్రి ఆరోపిస్తుంటాడు. అయినప్పటికీ యువరాజ్ ఎన్నడు కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. పైగా తనతో జట్టుకు అవసరం తీరిపోయిందని భావించాడు. అంతే తప్ప ఏనాడు ఎవరినీ నిందించలేదు.
జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ.. క్రికెట్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు యువరాజ్. టీమిండియా వన్డే సారథి గిల్ యువరాజ్ శిష్యుడే. అభిషేక్ శర్మకు, గిల్ కు ఎలా ఆడాలో నేర్పించింది యువరాజ్ సింగ్. కోవిడ్ సమయంలో వీరిద్దరికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి.. మెరికల మాదిరిగా తీర్చిదిద్దాడు. అందువల్లే అభిషేక్ ఆ స్థాయిలో ఆడుతున్నాడు..
ఇక గిల్ కూడా తన బ్యాటింగ్లో స్థిరత్వాన్ని పెంచుకొని పాతిక సంవత్సరాల వయసుకే టెస్ట్ ఫార్మాట్, వన్డే ఫార్మాట్ లో సారధిగా నియమితుడయ్యాడు. ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్లో తాను ఏమిటో నిరూపించుకున్నాడు. వన్డే ఫార్మేట్లో కూడా అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లాండ్ జట్టుతో నాయకుడిగా తన టెస్ట్ కెరియర్ ను ప్రారంభిస్తే.. ఆస్ట్రేలియా జట్టుతో నాయకుడిగా తన వన్డే ప్రస్తానాన్ని మొదలు పెట్టబోతున్నాడు గిల్. ఏ మేనేజ్మెంట్ అయితే తనను నాయకుడిగా అంగీకరించలేదో.. అదే మేనేజ్మెంట్ తన శిష్యుడిని సారధిగా నియమించేలా చేశాడు యువరాజ్.