Abhishek Sharma performance: ఎడమ చేతి వాటం బ్యాటింగ్.. బంతి ఎలా వచ్చినా సరే.. బౌండరీ వైపు వెళ్లాల్సిందే. బౌలర్ ఎవరైనా సరే ప్రేక్షక పాత్రకు పరిమితం కావాల్సిందే. వచ్చాడంటే విధ్వంసం మొదలైనట్టే. అది స్వదేశమైనా, విదేశమైనా ఒకటే లెక్క. స్థూలంగా చెప్పాలంటే ఊర మాస అనే పదానికి అసలు సిసలైన అర్థం లాగా అతని ఆట తీరు ఉంటుంది. అందుకే అతడిని అభిషేక్ శర్మలా కాకుండా.. అభి సిక్సర్ శర్మ లాగా విశ్లేషకులు పిలుస్తుంటారు.
ఏ ముహూర్తంలో అయితే టీమిండియాలోకి వచ్చాడో.. అప్పటినుంచి దుమ్ము రేపుతూనే ఉన్నాడు. పొట్టి ఫార్మాట్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్ లో అయితే బీభత్సానికే బీభత్సం లాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండవ టి20 మ్యాచ్లో 0 పరుగులను మినహాయిస్తే.. మొదటి, మూడో టి20 మ్యాచ్ లలో హాఫ్ సెంచరీలు చేసి.. టి20 వరల్డ్ కప్ ముందు ప్రత్యర్థులకు బలమైన హెచ్చరికలు పంపించాడు.
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన గుహవాటి మ్యాచ్లో 14 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా తాను ఎంత ప్రమాదకరమైన ఆటగాడినో ప్రపంచానికి మరోసారి తెలియజేశాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ పై ప్రశంసలు లభిస్తున్నాయి. అభిషేక్ శర్మ ఆట తీరుపై అతడి గురువు యువరాజ్ సింగ్ మాత్రం అంత సానుకూల దృక్పథంతో లేడు. ఎందుకంటే యువరాజ్ 2007 t20 వరల్డ్ కప్ లో ఇంగ్లీష్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇంతవరకు ఆ రికార్డు ఏ ఆటగాడు కూడా బద్దలు కొట్టలేకపోయాడు. అయితే న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ యువరాజ్ రికార్డును బ్రేక్ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, అభిషేక్ శర్మ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. తన శిష్యుడు ఈ స్థాయిలో ఘనత అందుకున్నప్పటికీ యువరాజ్ అంత సానుకూలంగా స్పందించలేదు. పైగా నా రికార్డును బద్దలు కొట్టలేకపోయావంటూ అభిషేక్ శర్మతో సరదాగా వ్యాఖ్యానించాడు. మొత్తానికి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావంటూ అభినందించాడు. యువరాజ్ శిక్షణలోనే అభిషేక్ శర్మ ఈ స్థాయిలో రాటు తేలాడు. అంతటి కరోనా సమయంలో కూడా అభిషేక్ శర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడాన్ని ఆపలేదంటే.. అతనికి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.