Guntur Crime news: అనైతికమైన బంధాలు ఎప్పటికైనా ప్రమాదమే. వీటి వల్ల జరిగే దారుణాలు.. ఘోరాలు కుటుంబాలలో అనేక ఆటుపోట్లకు కారణమవుతుంటాయి. కానీ, వీటికి అలవాటు పడినవారు మానుకోలేరు. పైగా అయినవాళ్లను మోసం చేస్తూ.. తమ కోరికలు.. మోహాల కోసం చివరికి కుటుంబ సభ్యులను సైతం బలి పెడుతుంటారు. ఈ తరహా సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయినప్పటికీ.. పోలీసులు, న్యాయస్థానాలు కఠినమైన శిక్షలు విధిస్తున్నప్పటికీ చాలామందిలో మార్పు రావడం లేదు. పైగా ఈ తరహా ఘోరాలు అంతకంతకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను ఓ వివాహిత అంతం చేసింది. ఈ సంఘటన మర్చిపోకముందే గుంటూరులో మరో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అలవాటు పడిన ఓ మహిళ తన భర్తను ఖతం చేసింది. అతడిని అంతం చేయడానికి ప్రియుడి సహాయం తీసుకుంది. చివరికి దొరికిపోయింది.
గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం చిలువూరు అనే గ్రామంలో లక్ష్మి మాధురి, శివ నాగరాజు దంపతులు నివసించేవారు. మాధురి విజయవాడలో ఓ సినిమా థియేటర్లో టికెట్ కౌంటర్ లో పనిచేసేది. శివ నాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేసేవాడు. భర్త చేస్తున్న వ్యాపారం మాధవికి ఏమాత్రం నచ్చేది కాదు. ఈ నేపథ్యంలోనే ఆమెకు సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
గోపి హైదరాబాదులో ట్రావెల్స్ వ్యాపారం చేసేవాడు. అయితే భర్తను కొద్దికాలంపాటు గోపి వద్దకు పంపించింది మాధురి. ఆ తర్వాత ఆ వ్యాపారం మీద అతడికి అంతగా ఆసక్తి అనిపించలేదు. దీనికి తోడు గోపి తరచుగా చిలువూరు వెళ్లడం శివ నాగరాజుకు అనుమానం కలిగింది. దీంతో ఒకరోజు అతడు చూడకూడని దృశ్యాన్ని చూశాడు. దీంతో వెంటనే అతడు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్లిపోయాడు…
భర్త స్వగ్రామానికి రావడంతో మాధురి ఆటలు సాగలేదు. ప్రియుడితో సంబంధానికి అడ్డంగా ఉండడం భావించి ఒక ప్రణాళిక రూపొందించింది. శివ నాగరాజును అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఈ ప్రణాళికను ప్రియుడితో చెప్పింది. వెంటనే గోపి తనకు తెలిసిన ఆర్ఎంపీ వైద్యుడిని సంప్రదించాడు. అతడు గోపికి నిద్ర మాత్రలు ఇచ్చాడు. దీంతో మాధురి నిద్ర మాత్రలను భర్తకు బిర్యానీలో పెట్టింది. అది తిన్న శివ నాగరాజు నిద్రలోకి జారుకున్నాడు. అతడు నిద్రపోయిన తర్వాత గోపి తో కలిసి మాధురి అప్పడాల కర్రతో గుండె మీద కొట్టింది. దీంతో అతడు చనిపోయాడు.
మొదట్లో తన భర్త మరణాన్ని సహజమైన చావుగా ప్రచారం చేసింది మాధురి. గుండెపోటుతో చనిపోయాడని చెప్పింది. ఆ తర్వాత శివ నాగరాజు స్నేహితులకు అనుమానం వచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలుపెట్టారు. పోస్టుమార్టం నివేదికలో బలమైన గాయాలు తగిలినట్టు తేలింది. దీంతో పోలీసులు మాధురి, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక మాధురి, గోపి, ఆర్ఎంపి వైద్యుడు సురేష్ ను అధికారికంగా అరెస్ట్ చేసి.. సోమవారం ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. ఈ ఘటన ఉమ్మడి గుంటూరు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.