Tilak Varma: మరికొద్ది రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈసారి జరిగే టి20 వరల్డ్ కప్ కు భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిసిసిఐ ఏర్పాట్లు పూర్తిచేసింది. టి20 ప్రపంచ కప్ నిర్వహణ కోసం షెడ్యూల్ కూడా విడుదల చేసింది.
టి20 ప్రపంచ కప్ కోసం టీమిండియా ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. అందులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చోటు దక్కించుకున్నాడు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ పై తిలక్ వర్మ వీరోచితమైన పోరాటం చేశాడు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. టీమిండియా కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో తిలక్ వర్మ మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్ గా మారిపోయాడు.
తిలక్ వర్మ ఆ తర్వాత జట్టులో వరుసగా అవకాశాలు పొందడం మొదలైంది. వచ్చిన అవకాశాలను కూడా తిలక్ వర్మ సద్వినియోగం చేసుకున్నాడు. అయితే ఇటీవల తిలక్ వర్మ గాయపడ్డాడు. టి20 ప్రపంచకప్ లో చోటు దక్కినప్పటికీ.. అతనికి గాయం కావడంతో ఆడేది అనుమానమేనని అందరూ అనుకున్నారు. కానీ అతడు ఇప్పుడు పూర్తిస్థాయిలో సామర్థ్యం సాధించాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో టి20 ప్రపంచ కప్ లో అతడు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చేనెల 4వ తేదీన దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే వార్మప్ మ్యాచ్ కు అతడు అందుబాటులోకి వస్తాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న టి20 సిరీస్లో టీమ్ ఇండియా దూసుకుపోతోంది. ఇప్పటికే వరుసగా మూడు విజయాలు సాధించి ట్రోఫీని అందుకుంది. ఈ సిరీస్లో ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్ లోకి వచ్చాడు. ముఖ్యంగా రెండవ టి20 మ్యాచ్లో వన్ మ్యాన్ షో చేశాడు. అభిషేక్ శర్మ అవుట్ అయినప్పటికీ అదరగొట్టాడు. ఇప్పుడు ఇషాన్ కిషన్ కు అభిషేక్ శర్మ తోడైతే విధ్వంసం మామూలుగా ఉండదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కిషన్ ఫామ్ లోకి వచ్చినప్పటికీ.. సంజు శాంసన్ తన నిర్లక్ష్యాన్ని చాటుకుంటున్నాడు. కీపింగ్ లో అదరగొడుతున్నప్పటికీ.. బ్యాటింగ్ కు వచ్చేసరికి తేలిపోతున్నాడు. ఈ నేపథ్యంలో టి20 ప్రపంచ కప్ లో చోటు దక్కించుకున్నప్పటికీ సంజును రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేస్తారని వార్తలు వస్తున్నాయి. తిలక్ వర్మ పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించడంతో సంజు శాంసన్ తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే దీనిపై బీసీసీఐ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.