ICC Champions trophy 2025 PAK vs NZ
ICC Champions trophy 2025 PAK vs NZ : ఈ వ్యాఖ్యలను నిజం చేస్తూ పాకిస్తాన్ జట్టు(PAK vs NZ) ఆడింది. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో న్యూజిలాండ్ ముందు చేతులెత్తేసింది. వాస్తవానికి తొలి మూడు వికెట్లను త్వర త్వరగా నే పడగొట్టిన పాకిస్తాన్ బౌలర్లు.. తర్వాత చేతులెత్తేశారు.. పాకిస్తాన్ ఆశలను విల్ యంగ్ ( will young) చిదిమేశాడు.. 113 బంతులు ఎదుర్కొన్న అతడు.. 12 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 107 పరుగులు చేశాడు. యంగ్ సమయోచితమైన బ్యాటింగ్ వల్ల న్యూజిలాండ్ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. యంగ్, కాన్వే ఓపెనర్లుగా బరిలోకి దిగారు.. తొలి వికెట్ కు 39 పరుగులు జోడించారు. మరో ఓపెనర్ కాన్వే (10) అబ్రార్ అహ్మద్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేయడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విలియంసన్ నసీం షా మ్యాజికల్ డెలివరీకి అవుట్ కాక తప్పలేదు. అనంతరం వచ్చిన డారిల్ మిచెల్(10) కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. హరీస్ రౌఫ్ బౌలింగ్లో షాహిన్ అఫ్రిదీ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇలా 73 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ జట్టు కష్టాల్లో పడింది. ఈ సమయంలో సొంతమైదానం కావడంతో పాకిస్తాన్ బౌలర్లు మరింత రెచ్చిపోతారని అందరూ ఊహించారు. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుకు భంగపాటు తప్పదని అనుకున్నారు. కానీ ఇక్కడే అందరి అంచనాలను యంగ్, లాథమ్ తలకిందులు చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు ఏకంగా 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. పాకిస్తాన్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ.. చెత్త బంతులను శిక్షిస్తూ న్యూజిలాండ్ స్కోర్ ను పరుగులు పెట్టించారు. 73 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు స్కోరును.. 191 పరులగులకు చేర్చారు. ఫలితంగా న్యూజిలాండ్ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది.
బౌలింగ్ లయ తప్పింది
20 ఓవర్ల వరకు పాకిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.. ముఖ్యంగా అబ్రార్ అహ్మద్ కట్టదిట్టంగా బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్లో న్యూజిలాండ్ ఆటగాళ్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు. నసీమ్ షా కూడా పదునైన బంతులు వేశాడు.. హరీస్ రౌఫ్ కూడా మ్యాజికల్ డెలివరీలు సంధించాడు. కానీ ఎప్పుడైతే లాథం (72* కథనం రాసే సమయం వరకు) వచ్చాడో.. అప్పుడే పాకిస్తాన్ బౌలర్ల బౌలింగ్ లయ తప్పింది. న్యూజిలాండ్ క్రమంగా ఇన్నింగ్స్ నిర్మించడం మొదలు పెట్టింది. యంగ్, లాథం పాకిస్తాన్ బౌలర్లపై నిదానంగా ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. దీంతో పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కడపటి వార్తలు అందే సమయానికి న్యూజిలాండ్ జట్టు నాలుగు వికెట్లు నష్టానికి 218 పరుగులు చేసింది. లాథం(72), ఫిలిప్స్ (10) క్రీజ్ లో ఉన్నారు.