MSK Prasad: ఎమ్మెస్కే మళ్లీ బుక్కయాడు.. ఈసారి 3డీ ప్లేయర్ లేడా? ఎందుకు సామీ నీకు ఈ తిప్పలు!

భారత్‌ వేదికగా 2023 వన్డే వరల్డ్‌ కప్‌ 40 రోజుల్లోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం టీమిండియా ఆసియా కప్‌పై దృష్టిపెట్టింది. మరోవైపు సెలక్టర్లు.. వరల్డ్‌ కప్‌ జట్టు ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Written By: Raj Shekar, Updated On : August 27, 2023 8:42 am

MSK Prasad

Follow us on

MSK Prasad: భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మరోమారు నెటిజన్లకు చిక్కాడు. కొద్ది రోజుల్లో వన్డే వరల్డ్‌ కప్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. 2019 వరల్డ్‌ కప్‌ సమయంలో చీఫ్‌ సెలక్టర్‌గా ఉన్న ఎమ్మెస్కే కుల రాజకీయాల కోసం తెలుగు ఆటగాడు.. మంచి ఫాంలో ఉన్న అంబటి రాయుడును వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక చేయలేదు. దీంతో నొచ్చుకున్న రాయుడు వన్డే, టెస్ట్‌, టీ20 ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. నాడు ఎమ్మెస్కే నిర్ణయాన్ని అభిమానులతోపాటు సీనియర్‌ క్రికెటర్లు సైతం తప్పు పట్టారు. కానీ ఎమ్మెస్కే రాయుడును తప్పించడాన్ని సమర్థించుకున్నారు. ఇప‍్పటికీ సమర్థించుకుంటూనే ఉన్నారు.

వన్డే.. వరల్డ్‌ కప్‌కు 40 రోజులు
ఇక భారత్‌ వేదికగా 2023 వన్డే వరల్డ్‌ కప్‌ 40 రోజుల్లోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం టీమిండియా ఆసియా కప్‌పై దృష్టిపెట్టింది. మరోవైపు సెలక్టర్లు.. వరల్డ్‌ కప్‌ జట్టు ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. సొంత గడ్డపై కప్‌ సాధించాలన్న లక్ష్యంతో సెలక్టర్లు ఆటగాళ్లను జల్లెడ పడుతున్నారు. సెప్టెంబర్‌ 4న జట్టును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

అంచనా జట్టు ఎంపిక..
ఇదిలా ఉండగా, కొంతమంది భారత మాజీలు ఆలోగా తమ అంచనాలతో కూడిన జట్టును ప్రకటిస్తున్నారు. మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఇప్పటికే తమ అంచనా జట్టును వెల్లడించారు. భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రపంచ కప్ కోసం తాజాగా తన జట్టును ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ‘3 డీ’ ప్లేయర్ ట్యాగ్‌తో నెట్టింట్లో ట్రోల్‌ అవుతున్నారు.

నాడు రాయుడు ప్లేస్‌లో విజయశంకర్‌..
2019 ప్రపంచకప్ సమయంలో ఎమ్మెస్కే ప్రసాద్ టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ఉన్నాడు. అప్పుడు ఆల్‌రౌండర్‌ విజయ్ శంకర్‌ను ఎమ్మెస్కే ప్రసాద్ ‘3 డీ’ ప్లేయర్‌గా అభివర్ణించి ప్రపంచకప్ జట్టులోకి తీసుకున్నారు. ఇందుకోసం తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడిని బలి చేశాడు. దీంతో రాయుడు బహిరంగంగానే సెలెక్టర్లపై విమర్శలు గుప్పించాడు. ప్రస్తుతం ఎమ్మెస్కే ప్రసాద్ 2023 ప్రపంచకప్ కోస జట్టు ప్రకటించడంతో నెటిజన్లు ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. ‘మీ జట్టులో ‘3 డీ’ ప్లేయర్ ఎవరు?, మీరు ‘3 డీ’ ప్లేయర్‌ను మర్చిపోయారు, విజయ్ శంకర్ ఎక్కడికి వెళ్లాడు?’ అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

తెలుగు కుర్రాడాని మళ్లీ తపిపంచాడు..
తెలుగు వాడైన ఎమ్మెస్కే ప్రసాద్‌.. తెలుగు ఆటగాళ్లను తక్కువగా చూస్తున్నారు. ముంబై, గుజరాత్‌ క్రికెటర్లు జట్టును శాసిస్తున్న నేటి రోజుల్లో ఎమ్మెస్కే తన అంచనా జట్టులో కూడా తెలుగు క్రికెటర్‌కు స్థానం కల్పించలేకపోయారు. మంచి ఫాంలో ఉన్న తిలక్‌ వర్మకు తన అంచనా జట్టుకు ఎంపిక చేయలేదు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే చాలాకాలంగా వన్డే క్రికెట్‌కు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ను తన జట్టులోకి తీసుకున్నారు. ఇదే ఇప్పుడు ఎమ్మెస్కేను నెటిజన్లు, క్రికెట్‌ అభిమానులు ట్రోల్‌ చేయడానికి కారణమైంది.

ఎమ్మెస్కే ప్రసాద్ జట్టు ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ /యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.