Yashasvi Jaiswal Pani Puri: టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ గురించి అందరికీ తెలిసిందే. నిరుపేద కుటుంబంలో పుట్టిన జైస్వాల్ అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని అంతర్జాతీయ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలోనే జైస్వాల్ తన తండ్రికి సహకారంగా పానీ పూరీలు కూడా అమ్మాడని, అయినప్పటికీ మొక్కవోని దీక్షతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడని ఈ మధ్యకాలంలో తెగ ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని యశస్వి జైస్వాల్ కూడా ఇప్పటి వరకు ఎక్కడ ఖండించలేదు. దీంతో ఇదంతా వాస్తవమేనని క్రికెట్ అభిమానులు భావిస్తూ వచ్చారు. అయితే, యశస్వి జైస్వాల్ గురించి పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ ప్రచారం అంతా వట్టిదేనని అతడి కోచ్ స్పష్టం చేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ తోపాటు ఐపిఎల్ లోను అదరగొట్టడం ద్వారా క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్. అద్భుతమైన ఆటతీరుతో భారత జట్టుకు ఎంపికైన జైస్వాల్.. వెస్టిండీస్ పర్యటనకు తాజాగా వెళ్లాడు. ఈ పర్యటనలో తన అంతర్జాతీయ కెరియర్ లో తొలి టెస్ట్ ఆడిన జైస్వాల్ ఈ ఇన్నింగ్స్ లో అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఈ యువ క్రికెటర్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టడానికి ముందు జైస్వాల్ అనేక ఇబ్బందులు పడ్డాడని, పానీపూరీలు అమ్మే తన తండ్రికి అనేకసార్లు సహకారాన్ని అందించాడని ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం అని తెలుస్తోంది.
ఎప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన జైస్వాల్..
యశస్వి జైస్వాల్ నిరుపేద కుటుంబంలో పుట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అందరూ అనుకుంటున్నట్లు పానీపూరీలు అమ్మి మాత్రం అతడు జీవనం సాగించలేదని యశస్వి జైస్వాల్ చిన్ననాటి కోచ్ ఇచ్చిన స్టేట్మెంట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. యశస్వి ఎప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్నతనంలో పానీపూరి అమ్మినట్లు చెప్పాడని, దానినే చాలామంది ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారంటూ యశస్వి జైస్వాల్ చిన్ననాటి జ్వాలా సింగ్ స్పష్టం చేశాడు. పానీ పూరి అన్నది జైస్వాల్ జీవితంలో లేదని రిపబ్లిక్ వరల్డ్ నిర్వహించిన ఇంటర్వ్యూలో జ్వాలా సింగ్ స్పష్టం చేశాడు. మీడియా మాత్రమే ఎప్పుడో ఒకసారి చెప్పిన విషయాన్ని హెడ్డింగుల కోసం ఇలా వాడుతున్నారు అంటూ ఆయన వెల్లడించాడు. మీడియా తమ కథనాలకు ప్రాధాన్యత తెచ్చుకునే ఉద్దేశంతో పానీపూరి థీమ్ ను హెడ్ లైన్స్ గా చేసుకొని పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం చేశారని జ్వాలా సింగ్ వివరించాడు. జైస్వాల్ మంచి ప్రదర్శన ఇచ్చిన ప్రతిసారి పానీ పూరి స్టాల్ వద్ద ఒక వ్యక్తితో నిలబడి ఉన్న ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి జైస్వాల్ తండ్రి అంటూ మీడియాలో కథనాలు ప్రారంభం అవుతుంటాయి.
కానీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి జైస్వాల్ తండ్రి కాదని, అది ఒక సాధారణమైన పానీపూరీలు విక్రయించే వ్యక్తి ఫోటో అని జ్వాలా సింగ్ వెల్లడించడం గమనార్హం. 2013 లో జైస్వాల్ క్రికెట్ కోచింగ్ ప్రారంభించినప్పుడు పానీపూరీలు అమ్మలేదని, అతను ముంబైకి మొదట వచ్చినప్పుడు డేరాలో నివసించేవాడని కోచ్ వెల్లడించాడు. గడిచిన 10 ఏళ్లుగా యశస్విని చూస్తున్నానని, అండర్-19 ప్రపంచ కప్ కు ముందు పానీ పూరి అమ్మేవాడంటూ కథనాలు వచ్చేవని, యశస్వికి సహాయం చేసిన వ్యక్తుల సహకారాన్ని కించ పరుస్తాయని జ్వాలా సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. మొదట్లో ముంబైకి వచ్చినప్పుడు అతని తల్లిదండ్రులు ప్రతినెల 1000 చెల్లించే వారిని, అతని తండ్రికి పెయింటింగ్ షాప్ ఉందని బయటపెట్టాడు. సరైన కోచింగ్ వల్ల జైస్వాల్ ఈరోజు క్రికెట్ ఆడుతున్నాడని, వారికి ఆహారం, నివాసం, అన్ని సమకూర్చి, చేతనైనంత సాయం చేసినట్లు, నా జీవితంలో తొమ్మిదేళ్ల విలువైన సమయాన్ని జైస్వాల్ కు కేటాయించినట్లు జ్వాలా సింగ్ ప్రకటించాడు. తాజాగా జ్వాలా సింగ్ బయటపెట్టిన ఈ విషయం నిజమైనదా..? లేక ఇన్నాళ్ళు ప్రచారం జరుగుతున్నట్లు జైస్వాల్ పానీ పూరీలు అమ్మాడా.. ? అన్నది జైస్వాల్ చెబితే గాని స్పష్టం కాదని పలువురు చెబుతున్నారు. జైస్వాల్ చిన్ననాటి కోచ్ బయట పెట్టిన ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు.. భలేగా బకరాలను చేశాడంటూ పేర్కొంటున్నారు.