WTC Final : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లు కనిపిస్తున్నాయి. భారత జట్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయం గురించి కాకుండా డ్రా చేసుకోవడంపైనే దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతిష్టాత్మక మ్యాచ్ లో భారత జట్టు అదరగొడుతుందనుకున్న తరుణంలో కీలక ఆటగాళ్లు విఫలం కావడంతో ప్రస్తుతం డ్రా చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన పరిస్థితి జట్టుకు ఏర్పడింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు తడబాటుకు గురైంది. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ చేయడంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది భారత జట్టు. మొదటి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది ఇండియా జట్టు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొదటి ఇన్నింగ్స్ లో 300 పరుగులు చేయడం కూడా కష్టంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో మ్యాచ్ లో విజయం సాధించడం కంటే డ్రా చేసుకోవడమే జట్టుకు సవాల్ గా మారింది. ప్రస్తుతం రహానే (29), కెఎస్ భరత్ (5) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ నిలదొక్కుకుంటే డ్రా దిశగా మ్యాచ్ ను తీసుకెళ్లే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఘోరంగా విఫలమైన టాపార్డర్..
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భారత జట్టు ఘోరంగా విఫలమైంది. మొదటి ఇన్నింగ్స్ లో టాపార్డర్ చేతులెత్తేయడంతో 150 పరుగులు లోపే ఐదు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. ఓపెనర్లు రోహిత్ (15), సుబ్ మన్ గిల్ (13) నిరాశపర్చగా.. టెస్టు స్పెషలిస్ట్ చటేశ్వర పుజారా (14) కూడా విఫలమయ్యాడు. ఆదుకుంటాడు అనుకున్న విరాట్ కోహ్లీ (14) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (48 : 51 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా ఆడిన దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, బోలాండ్, గ్రీన్, లైయాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 469 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
మ్యాచ్ ఆరంభం నుంచి భారత జట్టుకు షాక్ లు..
భారత్ కు ఇన్నింగ్స్ ఆరంభం నుంచే గట్టి షాక్ లు తగిలాయి. రెండు ఫోర్లు బాది మంచి టచ్ లో కనిపించిన రోహిత్ శర్మను కమిన్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బోలాండ్ వేసిన తరువాత ఓవర్ లో గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టీ విరామం తర్వాత చటేశ్వర పుజారా కామెరాన్ గ్రీన్ బౌలింగ్ లో వికెట్ పడేసుకున్నాడు. కొద్దిసేపటికి విరాట్ కోహ్లీ పెవిలియన్ చేరాడు. స్టార్కు బౌలింగ్ లో ఎక్స్ట్రా బౌన్స్ తో వచ్చిన బంతిని ఆడి స్లిప్ లో స్టీవ్ స్మితకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఇండియా 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే రహానే, జడేజా క్రీజులో కుదురుకుని భారత జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. జడేజా దూకుడు ప్రదర్శించిన రహనే నెమ్మదిగా ఆడాడు. కమిన్స్ వేసిన 22వ ఓవర్లో చివరి బంతికి రహనే వికెట్ల ముందు దొరికిపోగా రివ్యూ తీసుకోవడంతో ఆ బంతి నో బాల్ గా తేలింది. రహానే ఆ విధంగా బతికిపోయాడు. మరోవైపు జడేజా దూకుడు కొనసాగించాడు. 32 వ ఓవర్ లో ఫోర్ బాదిన అతడు స్టార్క్ వేసిన 34వ ఓవర్లో రెండు ఫోర్లు, సహా 12 పరుగులు రాబట్టాడు. కానీ, జడేజా జోరుకు లైయన్ బ్రేకులు వేశాడు. లైయన్ బౌలింగ్ లో జడ్డు స్లిప్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత జట్టు మ్యాచ్ గెలవడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇక మన జట్టు పోరాటం డ్రా కోసమే. మ్యాచ్ డ్రా చేసుకోవాలంటే మూడో రోజు మొదటి సెషన్ భారత్ కు కీలకము కానుంది. ఉదయం పూట పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తుంది. ఆసీస్ పేసర్లను ఎదుర్కొని క్రీజులో నిలదొక్కుకోకోవడం భారత ఆటగాళ్లకు సవాలే. దీంతో మ్యాచ్ ఏమవుతుందో అన్న ఆందోళన భారత అభిమానుల్లో వ్యక్తం అవుతోంది.