Matheesha Pathirana IPL Auction 2026: ఈ రోజుల్లో పొందిన సహాయాన్ని గుర్తు పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ. స్వార్థం మాత్రమే రాజ్యమేలుతున్న నేటి కాలంలో ఎదుటి వ్యక్తి నుంచి పొందిన సహాయాన్ని గుర్తుపెట్టుకొనే వారు అరుదుగా మారిపోయారు. కానీ కొందరు మాత్రం పొందిన సహాయాన్ని.. లభించిన సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోరు. ఆ జాబితాలో శ్రీలంక బౌలర్ మతిష పతిరణ ముందు వరుసలో ఉంటాడు. శ్రీలంక దేశానికి చెందిన ఈ పేస్ బౌలర్ మన దేశం మీడియాలో ప్రధాన వార్తలలో నిలిచాడు. ఇలా జరగడం వెనుక ఓ కారణం ఉంది.
యంగ్ ప్లేయర్లను ప్రోత్సహించడంలో టీమ్ ఇండియా ఒకప్పటి సారథి ధోని ముందుండేవాడు. ఐపీఎల్ ఆడుతున్నప్పుడు అతని దృష్టిలో మతిష పతిరణ పడ్డాడు. దీంతో అతడికి విస్తృతంగా అవకాశాలు కల్పించాడు ధోని. వచ్చిన అవకాశాలను మతిష పతిరణ సద్వినియోగం చేసుకున్నాడు. వైవిధ్యమైన బౌలింగ్ తో తనకంటూ ప్రత్యేకమైన నేపథ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్ లో ప్రత్యేకమైన బౌలర్ గా అవతరించాడు. నిన్న జరిగిన మినీ ఐపీఎల్ వేలంలో మతీష పతిరణ ను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం 18 కోట్లకు కొనుగోలు చేసింది.
తనకు 18 కోట్ల ధర దక్కడం వెనుక మతీష పతిరణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన ఐపిఎల్ జర్నీని పంచుకున్నాడు. ” పసుపు రంగు జెర్సీ ధరించాలనేది నాకు ఒక కోరిక. ఆ జెర్సీని ధరించిన తర్వాత మహి భాయ్ నాలో స్ఫూర్తి నింపాడు. 2022 నుంచి 2025 వరకు ప్రతి సందర్భాన్ని చెన్నై జట్టులో ఆస్వాదించాను. ఆ జట్టులో ఉండగానే 50 వికెట్ల మైలురాయి అందుకోవాలని అనుకున్నాను. కానీ అది సాధ్యం కాలేదు. మేనేజ్మెంట్ నాకు సహకారం ఇచ్చింది. ధోని వల్ల ఇదంతా సాధ్యమైంది. అతని వల్ల చెన్నై యాజమాన్యం విపరీతమైన ప్రేమను నామీద కురిపించింది. నా మదిలో చెన్నై జట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.. చెన్నై ప్రాంతాన్ని నా సొంత ఇంటికి భావిస్తాను. ఇప్పటివరకు చెన్నై తరపున ఆడిన నేను.. వచ్చే సీజన్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను” అని మతీష పతిరణ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మతీష పతిరణ నాలుగేళ్ల పాటు చెన్నై జట్టుకు ఆడాడు. 32 మ్యాచులలో బౌలింగ్ చేసి 47 వికెట్లు సొంతం చేసుకున్నాడు.