WTC Final 2025 Temba Bavuma: అది ప్రఖ్యాత డబ్ల్యూటీసీ ఫైనల్.. ప్రోటీస్, కంగారు జట్లు తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన ప్రోటీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ బౌలర్లు కూడా అదరగొట్టారు. దీంతో కంగారు జట్టును 212 పరుగులకు పరిమితం చేశారు. స్మిత్ (66), వెబ్ స్టర్(72) అర్థ శతకాలు చేయకపోతే పరిస్థితి దారుణంగా ఉండేది. ప్రొటీస్ జట్టులో రబాడా ఐదు వికెట్లు పడగొట్టాడు. జాన్సన్ మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. తక్కువ స్కోరుకే కంగారు జట్టు తొలి ఇన్నింగ్స్ ముగియడంతో.. ప్రోటీస్ జట్టు భారీగా ఆడుతుందని.. సూపర్ పరుగులు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కంగారు జట్టు బౌలర్ల ముందు ప్రోటీస్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు.. స్టార్క్ 2 వికెట్లు పడగొట్టాడు. హేజిల్ వుడ్, కమిన్స్ చెరో వికెట్ సాధించారు..మార్క్రం(0), రికెల్టన్ (16), ముల్డర్(6), స్టబ్స్(2) దారుణంగా నిరాశపరిచారు. తద్వారా ప్రోటీస్ జట్టు 50 పరుగులు చేయకుండానే నాలుగు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసిన సమయానికి ప్రోటీస్ జట్టు 43 పరుగులు మాత్రమే చేయగలిగింది.. ఒకరకంగా కంగారు జట్టు బౌలర్ల ఎదుట తలవంచింది…
ఇక ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన సారధి బవుమా అత్యంత నింపాదిగా బ్యాటింగ్ చేశాడు. ప్రతి బంతిని డిఫెన్స్ మాత్రమే ఆడాడు. కంగారు బౌలర్లకు పరీక్ష పెట్టాడు. చెత్త బంతులను.. కూడా అతడు డిఫెన్స్ ఆడటం విశేషం. తొలి 30 బంతుల్లో అతడు ఒక పరుగు కూడా చేయలేకపోవడం గమనార్హం 31 బంతికి ఒక సింగల్ తీశాడు. ఆ తర్వాత మిగతా రెండు పరుగులు కూడా అతి కష్టంగా సాధించాడు. కొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న అతడు మూడు పరుగులు మాత్రమే చేయడం విశేషం. అతనికి తోడుగా మరో ఆటగాడు డేవిడ్ బెడింగ్ హం ఉన్నాడు. అతడు 8 పరుగులు చేశాడు. ఇందులో రెండు బౌండరీలు ఉన్నాయి. మొత్తంగా అతడు 9 బంతులను ఎదుర్కొన్నాడు. బవుమా 37 బంతులు ఎదుర్కొని మూడు పరుగులు మాత్రమే చేయడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. గల్లి స్థాయిలో ఆడే ఆటను లార్డ్స్ మైదానంలో ఆడుతున్నాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కంగారు బౌలర్ల సహనానికి అతడు పరీక్ష పెడుతున్నాడని.. ప్రతి బంతిని కూడా డిఫెన్స్ ఆడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
కంగారు జట్టు చేసిన స్కోరును సమం చేయడానికి ఇంకా ప్రోటీస్ 169 పరుగులు చేయాల్సి ఉంది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తోంది. బంతి మెలికలు తిరుగుతూ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తోంది.. దీంతో పరుగులు రావడం అత్యంత కష్టంగా మారింది. ముఖ్యంగా ఆఫ్ స్టంపు దిశగా బంతులు వేస్తూ కంగారు బౌలర్లు ప్రోటీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. అనవసరంగా ఆ బంతులను ఆడి బవుమా జట్టు ప్లేయర్లు వికెట్లను పడేసుకున్నారు.. మరి గురువారం నాడు కంగారు బౌలర్లు ఏ విధంగా ప్రదర్శన చేస్తారు? ప్రోటీస్ జట్టు బ్యాటర్లు ఏ విధంగా నిలబడతారు? అనే ప్రశ్నలకు మరికొద్ది క్షణాల్లో సమాధానం లభించనుంది.