WPL 2026 Final Dc vs Rcb: వడోదరలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ జట్టు రికార్డు సృష్టించింది. తద్వారా బెంగళూరు జట్టు ఎదుట భారీ లక్ష్యాన్ని విధించింది. ఈ మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు ప్రారంభంలో సమర్థవంతంగా బౌలింగ్ వేసినప్పటికీ.. ఆ తర్వాత పూర్తిగా లయ తప్పారు. దీంతో ఢిల్లీ జట్టు బ్యాటర్లు పండగ చేసుకున్నారు.
ఢిల్లీ జట్టు ఓపెనర్లు లిజల్ లీ(37), షఫాలీ వర్మ (20) తొలి వికెట్ కు 49 పరుగులు జోడించారు. ఆ తర్వాత వీరిద్దరూ అవుట్ అయ్యారు. అనంతరం వచ్చిన లారా (44), కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (57), హెన్రీ(35*) అదరగొట్టడంతో ఢిల్లీ జట్టు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండో వికెట్ కు కేవలం 23 పరుగులు మాత్రమే భాగస్వామ్యం నమోదు చేసిన ఢిల్లీ జట్టు.. మూడో వికెట్ కు 76.. నాలుగో వికెట్ కు 56 పరుగులు జోడించి.. బెంగళూరు జట్టు ముందు భారీ లక్ష్యాన్ని విధించింది. పవర్ ప్లే లో 53 పరుగులు చేసి ఢిల్లీ జట్టు బెంగళూరు బౌలర్లకు షాక్ ఇచ్చింది.
203 పరుగులు చేయడం ద్వారా ఢిల్లీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్ విభాగంలో అత్యధిక తొలి ఇన్నింగ్స్ పరుగులు చేసిన జట్ల జాబితాలో ఢిల్లీ జట్టు రెండో స్థానంలో చేరింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో ముంబై ఇండియన్స్ కొనసాగుతోంది. 2025 లో గుజరాత్ జట్టుపై ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల కోల్పోయి 213 పరుగులు చేసింది. రెండవ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనసాగుతోంది. ప్రస్తుత సీజన్లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు పై వడోదర వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు నాలుగు వికెట్ల కోల్పోయి 203 పరుగులు చేసింది. 2023లో ముంబై ఇండియన్స్ జట్టు ఉత్తరప్రదేశ్ పై నాలుగు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. 2026 లో ఎలిమినేటర్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
ఇక ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ జట్టు తరఫున హెన్రీ విధ్వంసం సృష్టించింది. కేవలం 15 బంతులు మాత్రమే ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 35 పరుగులు చేసింది. లారా కూడా 25 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 44 పరుగులు చేసింది. వీరిద్దరు కూడా ఢిల్లీ జట్టు స్కోర్ బోర్డును రాకెట్ వేగంతో పరుగులు పెట్టించారు. చివరి ఓవర్ లో 15 పరుగులు, 19 ఓవర్లో 24 పరుగులు, 18 ఓవర్ లో పది పరుగులు రావడం ద్వారా ఢిల్లీ జట్టు భారీ స్కోర్ చేయగలిగింది.