WPL GG vs DC Highlights : కాప్‌ ‘పాంచ్‌’ పటాకా.. షఫాలీ తుఫాన్‌ ఇన్నింగ్స్‌: గుజరాత్‌కు హ్యాట్రిక్‌ ఓటమి

WPL GG vs DC Highlights : డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్‌ ఓటముల్లో హ్యాట్రిక్‌ సాధించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా పది వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యింది. బ్యాటర్ల లోపం, బౌలర్ల నిలకడలేమితనంతో మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ పేసర్‌ మరిజానె కాప్‌ ‘పాంచ్‌’ పటాకాకు.. షఫాలీ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ కు బెంబేలెత్తింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ మళ్లీ గెలుపు బాటపట్టింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో శనివారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 10 […]

Written By: Bhaskar, Updated On : March 12, 2023 9:13 am
Follow us on

WPL GG vs DC Highlights : డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్‌ ఓటముల్లో హ్యాట్రిక్‌ సాధించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా పది వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యింది. బ్యాటర్ల లోపం, బౌలర్ల నిలకడలేమితనంతో మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ పేసర్‌ మరిజానె కాప్‌ ‘పాంచ్‌’ పటాకాకు.. షఫాలీ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ కు బెంబేలెత్తింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ మళ్లీ గెలుపు బాటపట్టింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో శనివారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న గుజరాత్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ కాప్‌ (4-0-15-5) దెబ్బకు 20 ఓవర్లలో 105/9 స్కోరు మాత్రమే చేసింది. కిమ్‌ గార్త్‌ (32 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. శిఖా పాండే 3 వికెట్లు పడగొట్టింది.

షఫాలీ తుఫాన్‌ ఇన్నింగ్స్‌

లక్ష్య ఛేదనలో షఫాలీ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడింది. మొదటి ఓవర్‌ మినహా మిగతా ఓవర్లలో విశ్వరూపం ప్రదర్శించింది. గుజరాత్‌ విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ 7.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. గత మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్‌ షఫాలీ వర్మ (28 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 76 నాటౌట్‌) పవర్‌ హిట్టింగ్‌తో గుజరాత్‌ బౌలర్లను ఉతికి ఆరేసింది. రెండో ఓవర్‌లో 6, 4 బాదిన షఫాలీ.. ఆ తర్వాతి ఓవర్‌లో మూడు ఫోర్లతో బ్యాట్‌ ఝుళిపించింది. ఇక, గార్డ్‌నర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లో వర్మ 2 బౌండ్రీలు, సిక్స్‌, లానింగ్‌ 2 ఫోర్లతో ఏకంగా 23 పరుగులు రాబట్టడంతో.. స్కోరు 50 పరుగులు దాటింది. కాగా, ఎదుర్కొన్న 19 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకొన్న షఫాలీ.. ఆరో ఓవర్‌లో మరో 2 సిక్స్‌లు బాదింది. షఫాలీకి మెగ్‌ లానింగ్‌ సహకరించడంతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది.

కాప్‌ పాంచ్‌ పటాకా

మరిజానె నిప్పులు చెరగడంతో.. 6/33తో పీకల్లోతు కష్టాల్లో పడిన జెయింట్స్‌ ఇన్నింగ్స్‌ ఎంతోసేపు కొనసాగదనిపించింది. కానీ, తుదికంటా క్రీజులో నిలిచిన గార్త్‌.. టీమ్‌ స్కోరును వంద పరుగుల మార్క్‌ దాటించింది. వేర్హమ్‌ (22)తో కలసి ఏడో వికెట్‌కు 33 పరుగులు జోడించి గార్త్‌.. 8వ వికెట్‌కు తనూజ (13)తో 28 పరుగుల భాగస్వామ్యంతో టీమ్‌ను ఆదుకొనే ప్రయత్నం చేసింది. నిలకడగా ఆడుతున్న వేర్హమ్‌ను 13 ఓవర్‌లో రాధా యాదవ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేసింది. మ్యాచ్‌ ఆరంభంలో ఓపెనర్లు మేఘన (0), లారా వొల్వర్డ్‌ (1)తోపాటు గార్డ్‌నర్‌ (0)ను కాప్‌ పెవిలియన్‌ చేర్చడంతో గుజరాత్‌ కోలుకోలేదు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన హర్లీన్‌ డియోల్‌ (20)తోపాటు సుష్మ (2)ను కూడా మరిజానె అవుట్‌ చేసింది. మేఘన, లారా, గార్డ్‌నర్‌ నిలదొక్కుకుని ఉంటే గుజరాత్‌ పరిస్థితి మరోలా ఉండేది. కానీ వారు డబ్ల్యూపీఎల్‌ ప్రీమియర్‌ ప్రారంభం నాటి నుంచి చెప్పుకోదగిన ఇన్నింగ్స్‌ ఆడటం లేదు. ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. ఫలితంగా మిగతా బ్యాటర్ల మీద ఒత్తిడి పెరగడంతో భారీ స్కోరు సాధించే అవకాశం ఉండటం లేదు. దీంతో జట్టు ఓటమిపాలవుతోంది.