Mohammed Shami: న్యూజిలాండ్ జట్టులో జరిగిన వన్డే సిరీస్ ను భారత జట్టు కోల్పోయింది. తొలి వన్డేలో గెలిచిన టీం ఇండియా.. ఆ తదుపరి రెండు మ్యాచ్లను వరుసగా ఓడిపోయింది. ఈ విజయం ద్వారా న్యూజిలాండ్ జట్టు భారతదేశంలో తొలి వన్డే సిరీస్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వాస్తవానికి న్యూజిలాండ్ జట్టులో దాదాపు 8 మంది కొత్త క్రీడాకారులు ఉన్నారు. వీరిలో ఎవరికి కూడా టీమిండియా మైదానాలపై ఆడిన అనుభవం లేదు. అయినప్పటికీ బలమైన టీమ్ ఇండియాను ఓడగొట్టి సిరీస్ దక్కించుకున్నారు.
టీమిండియా సిరీస్ కోల్పోయిన తర్వాత రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. కొందరు గౌతం గంభీర్ జట్టుకూర్పు విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. మరికొందరేమో కెప్టెన్ గిల్ వ్యవహార శైలి సరిగ్గా లేదని ఆరోపిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో భారత జట్టు పూర్తిగా విఫలమైందని.. ముఖ్యంగా పవర్ ప్లే లో వికెట్లు తీయకపోవడం వల్ల టీమిండియా ప్రతికూల ఫలితాన్ని పొందాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతుండగానే మహమ్మద్ షమీ గురించి చర్చ మొదలైంది.
2023 వరల్డ్ కప్ లో మహమ్మద్ షమీ అత్యధిక వికెట్లు తీశాడు. ఆ తర్వాత అతడు కాలికి గాయం కావడం వల్ల శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిపోయాడు. తిరిగి వచ్చిన తర్వాత అతడికి జట్టులో అవకాశాలు లేకుండా పోయాయి. డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించినప్పటికీ అతడిని సెలెక్టర్లు కనికరించలేదు. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున ఆడినప్పటికీ అతడు అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు అతడికి జాతీయ జట్టులో చోటు ఇవ్వడానికి నిరాకరిస్తూ వస్తున్నారు. దీంతో షమీ కెరియర్ డోలాయమనంలో పడింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా ఓడిపోయిన తర్వాత షమీ గురించి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ సిరీస్లో న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్ అదరగొట్టాడు. రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ తో ఏకంగా 352 పరుగులు చేశాడు. అయితే అతడిని అవుట్ చేయడంలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు . అయితే మిచెల్ కు మాత్రం షమీ బద్ధ శత్రువు అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరిద్దరి మధ్య జరిగిన పోరులో షమీ అప్పర్ హ్యాండ్ కొనసాగించాడు. 16 సగటుతో నాలుగుసార్లు షమీని మిచెల్ అవుట్ చేశాడు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సిరీస్ లో షమీ కి కనుక అవకాశం ఇస్తే ఫలితం మరో విధంగా ఉండేదని టీమిండియా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
