World Test Championship: టి20 క్రికెట్ మొత్తాన్ని ఊపేస్తోంది. వన్డే ఫార్మాట్ కూడా అదరగొడుతోంది. ఎటోచ్చి టెస్ట్ ఫార్మాట్ మాత్రమే అంతగా ఆకట్టుకోలేకపోతోంది. టెస్ట్ ఫార్మాట్ సుదీర్ఘంగా సాగడం వల్ల ప్రేక్షకులకు కాస్త సాగదీత వ్యవహారం లాగా కనిపిస్తోంది. అయితే ఈ ఫార్మాట్ ను కూడా పోటాపోటీగా మార్చడానికి ఐసీసీ కొన్ని సంవత్సరాల క్రితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ అనే టోర్నీని తెరపైకి తీసుకొచ్చింది. ప్రతి రెండేళ్లకు ఈ టోర్నీ నిర్వహిస్తోంది.. ఇప్పటివరకు మూడుసార్లు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ నిర్వహించింది. తొలిసారి నిర్వహించిన టోర్నీలో టీమిండియా ఫైనల్ వెళ్లినప్పటికీ.. న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. రెండోసారి ఫైనల్ వెళ్లిన టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో భంగపాటుకు గురైంది. మూడోసారి ఆస్ట్రేలియా ఫైనల్ వెళ్లినప్పటికీ దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది.
తొలి సీజన్లో న్యూజిలాండ్.. రెండవ సీజన్లో ఆస్ట్రేలియా.. మూడవ సీజన్లో దక్షిణాఫ్రికా విజేతలుగా నిలిచాయి.. ఇక ప్రస్తుతం 2025-2027 season వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పోటీ నడుస్తోంది. ప్రస్తుతం 9 జట్లు ఆడుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆస్ట్రేలియా, భారత్, శ్రీలంక తొలి మూడు స్థానాలలో కొనసాగుతున్నాయి.. టీమిండియా నవంబర్ 14 నుంచి స్వదేశం వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఒకవేళ ఈ సిరీస్ లో కనుక టీమిండియా గెలిస్తే రెండవ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుంది. ఆ తదుపరి మిగతా టెస్ట్ సిరీస్ లలో టీమిండియా కనుక ఇదే జోరు కొనసాగిస్తాయి కచ్చితంగా ఫైనల్ వెళ్తుంది. ఈసారి ఎలాగైనా టెస్ట్ గద దక్కించుకోవాలని టీమ్ ఇండియా కృత నిశ్చయంతో ఉంది.
ఇక ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో 9 జట్లు ఆడుతున్నాయి. ఐసీసీ నిర్ణయం మేరకు 2027 -29 సీజన్ కు సంబంధించి 12 జట్లను ఆడించే యోచనలో ఐసీసీ ఉంది. 2 టైర్ సిస్టం రద్దుచేసి ఆఫ్గనిస్తాన్, జింబాబ్వే, ఐర్లాండ్ జట్లను జాబితాలో చేర్చే అవకాశం ఉంది. దీంతో ప్రతి జట్టుకు టెస్టు క్రికెట్ ఆడే అవకాశం లభిస్తుంది. తద్వారా పోటీ కూడా హోరాహోరీగా ఉంటుందని ఐసీసీ భావిస్తోంది. మరోవైపు టెస్ట్ క్రికెట్ కు ఆదరణ పెంచడానికి ఐసీసీ ప్రైజ్ మనీ కూడా భారీగా పెంచింది.
నగదు బహుమతిని భారీగా పెంచిన నేపథ్యంలో ఆయా జట్ల ప్లేయర్లు కూడా టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అంతేకాదు టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ప్రధానంగా కొంతమంది ఆటగాళ్లకు యాజమాన్యాలు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాయి. మొత్తంగా టెస్ట్ క్రికెట్ కు పాత రోజులను తీసుకురావడానికి ఐసీసీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పుడు ఏకంగా 12 జట్లను పోటీలో పెడితే టెస్ట్ క్రికెట్ పూర్తిగా మారే అవకాశం ఉంది.