World Cup Fever: వన్డే వరల్డ్ కప్ అసలైన మజా మొదలైంది. భారత్ వేదికగా సిరీస్ ప్రారంభమైన వారం తర్వాత ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్‌లో క్రికెట్ రసకందాయంలో పడింది. శనివారం భారత్–పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగబోతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియం దాయాదుల సమరానికి వేదక కానుంది. దీంతో గుజరాత్‌లో వరల్డ్ కస్ సందడి రెండు రోజులు ముందే మొదలైంది. ఆదివారం నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఒకవైపు వరల్డ్ కప్, మరోవైపు దేవీ నవరాత్రులు.. ఈ నేపథ్యంలో గుజరాతీ యువతుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.
ఒంటిపై టాటూలు..
భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం, క్రికెట్ అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్ పండుగను పురస్కరించుకుని ప్రజల్లో కూడా టాటూలపై క్రేజ్ కనిపించింది. దేవీ నవరాత్రులు, వరల్డ్ కప్ కలిసి వచ్చేలా గుజరాతీ యువతులు ఒంటిపై టాటూలు వేయించుకుంటున్నారు. అబ్బాయిలు క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి ఎంత ఉత్సాహంగా ఉంటారో అమ్మాయిలు కూడా అంతే ఉత్సాహంగా కనిపిస్తారు. అహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు చూసేందుకు పెద్ద సంఖ్యలో అమ్మాయిలు స్టేడియానికి వస్తుంటారు. భారత జట్టుకు మద్దతుగా టాటూలు కూడా వేయించుకున్నారు.
కోహ్లీ, రోహిత్‌శర్మ, బాబర్ టాటూలు..
ఇటు నవరాత్రులు, అటు క్రికెట్ ..ఇలా టాటూ కళాకారులు రెండు పెద్ద ఈవెంట్‌లను దృష్టిలో ఉంచుకుని టాటూ డిజై¯Œ లను సిద్ధం చేశారు. ఎరుపు, తెలుపు, బంగారు, నలుపు ఇలా.. శరీరానికి అనుకూలమైన రంగులను టాటూలలో ఉపయోగిస్తున్నారు. భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు ప్రపంచకప్, నవరాత్రుల నేపథ్యంలో అమ్మాయిలు టాటూలు వేయించుకున్నారు. ఈ టాటూలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌లు ఉన్నారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గార్బా ఆడుతున్నట్లు టాటూ వేయించుకుంది ఓ అమ్మాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో శాంతి కోసం విజ్ఞప్తి చేస్తూ కొందరు పచ్చబొట్లు కూడా వేయించుకున్నారు.
రూ.500 నుంచి రూ. 5 వేల వరకు
ఇక టాటూ ధర రంగు,స్టైల్, సైజు ఆధారంగా రూ.500 నుంచి రూ. 5 వేల వరకు ఉంది. ఇలా టాటూ వేయించుకోవడం ద్వారా.. స్టేడియంలోని భారత జట్టుకు యూత్, అమ్మాయిలు, ప్రేక్షకులు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ పట్ల ప్రజల్లో చాలా ఉత్సాహం ఉందనీ.. దీని కారణంగా ఈ డిజైన్లన్నీ తయారు చేశామని..అహ్మదాబాద్ టాటూ ఆర్టిస్ట్ రాజేంద్ర వాలంద్ తెలిపారు. ప్రజలు ఈ డిజైన్లను చాలా ఇష్టపడుతున్నారన్నారు.