World Cup 2023: వన్డే వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడుతోంది. భారత్ వేదికగా ఈ వరల్డ్ కప్ జరుగనుంది. ఈ టోర్నీలో టాస్ ప్రభావాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) పిచ్‌ను రూపొందించే క్యూరేటర్ల కోసం ఒక ప్రోటోకాల్‌ను రూపొందించింది. ఈ టోర్నీలో మ్యాచ్‌ల ఫలితాన్ని మంచు ప్రభావితం చేస్తుందని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీమర్లకు పిచ్ సహాయం చేయడానికి పిచ్‌లపై ఎక్కువ గడ్డిని వదిలివేయాలని ఐసీసీ క్యూరేటర్లను ఆదేశించింది. అదనంగా, బ్యాట్, బాల్ మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి స్టేడియంలో పెద్ద బౌండరీ పరిమాణం ఉండేలా చూడాలని సూచించింది.
2021లో టీ20 వరల్డ్ కప్‌లో మంచు ప్రభావం..
2021లో యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ను మంచు తీవ్రంగా ప్రభావితం చేసింది. సెకండ్‌గా బ్యాటింగ్ చేసే జట్టుకు ఎంతో ఉపయోగపడింది. భారత పరిస్థితులు సాధారణంగా స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. అయితే సీమర్లు ఆటలో ఉండేలా చూసేందుకు పిచ్‌లపై వీలైనంత ఎక్కువ గడ్డిని వదిలివేయాలని క్యూరేటర్లకు ఐసీసీ సూచించింది. తుది 11 మందిలో ఏ జట్టు అయినా ఎక్కువ మంది సీమర్లను ఉండేలా చూడడమే ఇందుకు కారణం.
భారత్‌లో మంచు ప్రభావం..
ప్రస్తుత సీజన్‌లో భారతదేశంలోని ఉత్తర, పశ్చిమ మరియు తూర్పు రాష్ట్రాల్లోని వేదికలపై భారీ మంచు కురిసే అవకాశం ఉంది. చెన్నై, బెంగళూరులో మ్యాచ్‌లకు వర్షం కారణంగా అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంచు కారణంగా టాస్ కీలకం కాకూడదనే ఉద్దేశంతో క్యూరేటర్లకు సూచనలు చేసింది. మంచు కారణంగా స్పిన్నర్లు ఎక్కువ ప్రభావితం చూపుతారు. గడ్డి ఎక్కువగా వదిలితే స్పిన్నర్లపై ఒత్తిడి తగ్గుతుంది. వారిపైనే ఆధార పడాల్సిన అవసరం ఉండదు.
బౌండరీల పెంపు..
మరోవైపు బ్యాట్, బాల్ మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి, స్టేడియాలు గరిష్టంగా సాధ్యమయ్యే బౌండరీ పరిమాణాన్ని కలిగి ఉండాలని ఐసీసీ చూసించింది. వేదికలు దాదాపు 70 మీటర్ల సరిహద్దు పరిమాణాన్ని నిర్వహించాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మ్యాచ్‌లకు కనిష్ట బౌండరీల పరిమాణం 65 మీటర్లు గరిష్టంగా 85 మీటర్లు. పాత సెంటర్‌ల సరిహద్దు పరిమాణం 70–75 మీటర్లు ఉంటుంది. ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్‌లో బౌండరీల పరిమాణం 70 మీటర్ల కంటే ఎక్కువ ఉంచాలని ఐసీసీ తెలిపింది.
ఐసీసీ నిబంధనల మేరకే..
భారత క్రికెట్ బోర్డు కూడా ఐసీసీ నిబంధనల మేరకు పిచ్‌లు రూపొందించాలని క్యూరేటర్లను ఆదేశించింది. ఈ రోజుల్లో చాలా వేదికలు వెట్ ఉండేలా తయారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు నిర్దేశించిన దానికంటే ఇతర వెట్టింగ్ ఏజెంట్‌ను ఉపయోగించొద్దని బోర్డు ప్రతి కేంద్రాన్ని ఆదేశించింది. అయితే భారత జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లపై టర్నింగ్ పిచ్‌లపై ఆడేందుకు ఇష్టపడుతుంది. అక్టోబరు 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు మంచు ప్రభావం పడే అవకాశం లేకపోగా, అక్టోబర్ 29న లక్నోలో ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్ క్యూరేటర్లకు సవాల్‌గా మారనుంది.