Pakistan Vs South Africa: యువరక్తం ఉన్నవారే క్రికెట్ లో రాణిస్తారని ఒక నానుడి ఉండేది. అయితే అది తప్పని నిరూపించాడు 41 సంవత్సరాల డివిలియర్స్. సౌత్ ఆఫ్రికా జట్టులో ఒకప్పుడు కింగ్ లా వెలుగొందిన డివిలియర్స్.. మిస్టర్ 360 గా పేరు పొందాడు. అంతేకాదు సౌత్ ఆఫ్రికా జట్టు సాధించిన విజయాలలో ముఖ్య పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ.. సౌత్ ఆఫ్రికా జట్టుకు.. అదికూడా 41 సంవత్సరాల వయసులో తిరుగులేని స్థాయిలో విజయాన్ని అందించాడు. డబ్ల్యూ సీఎల్ లో సౌత్ ఆఫ్రికా జట్టును విజేతగా నిలిపాడు.
ఇంగ్లాండ్ వేదికగా ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ జరిగింది. ఈ ఏడాదికి సంబంధించిన టోర్నీ ఫైనల్ మ్యాచ్ శనివారం ఇంగ్లాండ్ లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగింది. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఐదు వికెట్లు కోల్పోయి 195 రన్స్ చేసింది. సౌత్ ఆఫ్రికా ఈ టార్గెట్ ను కేవలం 16.5 ఓవర్లలో ఫినిష్ చేసింది. ఏబిడి సెంచరీ చేశాడు. డుమిని హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. డివిలియర్స్ 60 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 7 సిక్సర్లతో మోత మోగించాడు. ఏకంగా 120 పరుగులు చేశాడు. తద్వారా తన జట్టును విజేతగా నిలిపాడు.
డివిలియర్స్ వయసు ప్రస్తుతం 41 సంవత్సరాలు. అయినప్పటికీ అతడు అదే దూకుడు కొనసాగిస్తున్నాడు. యుక్త వయసులో ఉన్నప్పుడు అతడు ఎలాగైతే ఆడాడో.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. ఈ టోర్నీలో ఏకంగా మూడు సెంచరీలు చేశాడంటే అతడి బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా.. భయం అనేది లేకుండా అతను ఆడుతున్న తీరు అద్భుతం. అమోఘం.. ఫైనల్ మ్యాచ్లో అతడు కొట్టిన షాట్లు అభిమానులను, ప్రేక్షకులను అలరించాయి. చివరికి పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా అతని బ్యాటింగ్ చూసి సమ్మోహితులయ్యారంటే ఏబిడి స్టైల్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. సెమి ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ తో తలపడేందుకు టీమిండియా సంసిద్ధత వ్యక్తం చేయలేదు. దీంతో టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది. దీంతో సెమీఫైనల్ లో భారత జట్టుతో తలపడకుండానే పాకిస్తాన్ ఫైనల్ వెళ్లిపోయింది. ఫైనల్ దక్షిణాఫ్రికాతో తలపడి ఓడిపోయింది. పాకిస్తాన్ ఫైనల్లో ఓడిపోవడం పట్ల ఆ జట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.