England vs USA : డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ టి20 వరల్డ్ కప్ లో సెమీస్ దూసుకెళ్లింది. బార్బడోస్ వేదికగా ఆదివారం అమెరికాతో జరిగిన మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది..గ్రూప్ -2 లో ఉన్న ఇంగ్లాండ్ సమీస్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకుంది. మరోవైపు ఈ ఓటమి ద్వారా అమెరికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా 18.5 ఓవర్లలో 115 పరుగులకు కుప్పకూలింది. నితీష్ కుమార్ 24 బంతుల్లో 30 పరుగులు చేసి, టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్ లలో జోర్డాన్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆదిల్ రషీద్ రెండు వికెట్లు సాధించాడు. సామ్ కరణ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. జోర్డాన్ ఒకే ఓవర్ లో హ్యాట్రిక్ తో పాటు మరో వికెట్ దక్కించుకొని.. ఏకంగా నలుగురు ఆటగాళ్లను పెవిలియన్ పంపించాడు.. అతని జోరుకు 115/5 వద్ద ఉన్న అమెరికా.. ఆ తర్వాత ఒక్క పరుగు కూడా చేయకుండా 115 పరుగుల వద్ద ఆగిపోయింది.
అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా విజయం సాధించింది. కెప్టెన్ జోస్ బట్లర్ మైదానంలో విధ్వంసం సృష్టించాడు. 38 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో ఆరు ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అమెరికా బౌలర్ల పై ఏమాత్రం దయా దక్షిణ్యం లేకుండా అతడు విరుచుకుపడ్డాడు. బట్లర్ కు సాల్ట్ తోడయ్యాడు. ఇతడు 21 బంతుల్లో రెండు ఫోర్ ల సహాయంతో 25 పరుగులు చేశాడు.. వాస్తవానికి ఇంగ్లాండ్ చేజింగ్ కు దిగినప్పుడు, తొలి రెండు ఓవర్లలో ఆరు పరుగులు మాత్రమే చేసింది. కానీ, ఆ తర్వాతే బట్లర్ ఊర మాస్ బ్యాటింగ్ మొదలైంది.
సౌరభ్ నేత్రావల్కర్ వేసిన మూడో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి 19 పరుగులు పిండుకున్నాడు. ఇక అప్పటి నుంచి బట్లర్ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.. అతడి దూకుడుకు ఇంగ్లాండ్ జట్టు పవర్ ప్లే లో 60 పరుగులు చేసింది. ముఖ్యంగా హర్మిత్ సింగ్ వేసిన ఎనిమిదో ఓవర్ లో ఐదు సిక్సర్లు కొట్టాడు. ఏకంగా 32 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి ఓవర్ లో బట్లర్ బౌండరీ కొట్టి ఇంగ్లాండ్ జట్టుకు అద్భుతమైన విజయంతో పాటు, సెమిస్ చేర్చాడు