మైదనాంలో బయో బబుల్స్ ద్వారా ఐపీఎల్ నిర్వహణ సజావుగా సాగుతుందని బీసీసీఐ భావించింది. నిన్నామొన్నటి వరకు అలాగే సాగింది కూడా. అయితే.. అంతకంతకూ కేసులు పెరుగుతుండడంతో ఇండియా సేఫ్ కాదనే నిర్ణయానికి విదేశీఆటగాళ్లు వచ్చేశారు. అంతేకాదు.. కొందరు ఐపీఎల్ వదిలేసి సొంత దేశం చెక్కేశారు కూడా. మిగిలిన వాళ్లు కూడా నిర్ణయాలు తీసుకునేలోపు పలు దేశాలకు భారత్ నుంచి విమాన సర్వీసులు రద్దైపోయాయి. దీంతో.. వాళ్లు అనివార్యంగా ఇండియాలోనే ఉండిపోయారు. అయితే.. మనసులో మాత్రం ఒక విధమైన భయం ఉండనే ఉంది. అది ఆటతీరు మీద స్పష్టమైన ప్రభావం చూపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లోనే.. కోల్ కతా ఆటగాళ్లు కొవిడ్ బారిన పడడం మిగిలిన వారిలో భయాన్ని మరింతగా పెంచేసింది. అంతేకాదు.. చెన్నై బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, ఇద్దరు సిబ్బంది కూడా కొవిడ్ పాజిటివ్ గా తేలడంతో.. ఆందోళనలను మరింత పెరిగిపోయాయి. చాలా మంది ఆటగాళ్లు గ్రౌండ్ లోకి దిగేందుకు భయపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ కొనసాగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే.. బీసీసీఐ మాత్రం రద్దు వేసే ప్రసక్తే లేదని చెబుతోంది. ఇప్పటికే సగం పూర్తయిన నేపథ్యంలో టోర్నీ ఆపేస్తే.. ప్రాంచైజీలు తీవ్రంగా నష్టపోతాయని చెబుతోంది. ఇటు చూస్తే ఆటగాళ్లు భయంలో ఉన్నారు. కొందరు కొవిడ్ బారిన పడ్డారు కూడా. ఈ నేపథ్యంలో.. టోర్నీని మళ్లీ దుబాయ్ కు తరలించడమే మార్గమని అంటున్నారు. మరి, బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.