ICC Women’s Cricket: మహిళల క్రికెట్ కు ఆదరణ పెంచడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల నిర్వహించిన మహిళల వన్డే వరల్డ్ కప్ లో సమూల మార్పులు తీసుకొచ్చింది ఐసీసీ. పురుషుల మాదిరిగానే మహిళలకు ప్రైజ్ మనీ అందించింది. సౌకర్యాల కల్పనలో అదే తీరు కొనసాగించింది. మహిళల వన్డే వరల్డ్ కప్ అద్భుతంగా సాగింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ మాత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకుపోయిన టీమ్ ఇండియా.. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది.
ఫైనల్ మ్యాచ్లో టీం ఇండియా విజయం సాధించిన నేపథ్యంలో ప్రైజ్ మనీ గా ఐసీసీ 31 కోట్లు ఇచ్చింది. పురుషుల మాదిరిగానే మహిళలకు కూడా అదే స్థాయిలో ప్రైజ్ మనీ అందించి తమకు క్రికెట్ విషయంలో లింగ వ్యత్యాసం లేదని ఐసిసి నిరూపించింది. బిసిసిఐ 50 కోట్ల నజరానా ప్రకటించింది. మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీలు గతంలో చాలా జరిగాయి. అయితే ఎన్నడు లేనివిధంగా ఈసారి జరిగిన టోర్నీకి విశేషమైన ఆదరణ లభించింది. భారతదేశంలో ఈ టోర్నీ నిర్వహించడమే ఇందుకు ప్రధాన కారణమని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే మనదేశంలో క్రికెట్ ను చాలామంది చూస్తారు. పైగా మన దేశ అమ్మాయిలు ఈసారి ఫైనల్ దాకా వెళ్లడం.. ఫైనల్లో ట్రోఫీని సాధించడంతో చాలామంది అమ్మాయిల తల్లిదండ్రుల అభిప్రాయాలు మారిపోతున్నాయి. తమ పిల్లలను క్రికెట్ వైపు మళ్లించాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒక రకంగా శుభసూచకం.
మహిళల క్రికెట్ కు మరిత ఆదరణ పెంచడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రయత్నాలు చేస్తోంది. విపరీతమైన ప్రచారాన్ని కల్పించి.. విస్తరించాలని భావిస్తోంది. అందువల్లే మరో గ్లోబల్ టోర్నీ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనికి గ్లోబల్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ అని పేరు పెట్టింది. ఈ ట్రోఫీలో భాగంగా తొలి ఎడిషన్ ను బ్యాంకాక్ వేదికగా నిర్వహించనుంది. నవంబర్ 20 నుంచి 30 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. థాయిలాండ్, నెదర్లాండ్స్, పాపువా న్యూ గినియా, యూఏఈ, స్కాట్లాండ్, నమిబియా, టాంజానియా, ఉగాండా దేశాలతో ఈ టోర్నీ నిర్వహించనుంది. 8 దేశాల క్రీడాకారులతో టోర్నీ నిర్వహించి .. మహిళల క్రికెట్ కు మరింత ఆదరణ దక్కేలా చూడాలని ఐసీసీ భావిస్తోంది.
ఈ దేశాల టోర్నీలో గనక మహిళ క్రీడాకారులు అద్భుతంగా రాణించగలిగితే.. వారికి కూడా వన్డే, టి20 మ్యాచ్ లు ఆడే అవకాశాన్ని పరిశీలిస్తామని ఐసిసి చెబుతోంది. అంతేకాదు ఐసీసీలో వారికి సభ్యత్వం కూడా ఇస్తామని చెబుతోంది. ఒకవేళ ఈ దేశాల మహిళలు అద్భుతంగా ఆకట్టుకుంటే తదుపరి దశలో ఇంకా మరిన్ని జట్లు నమోదు అవుతాయి. తద్వారా మహిళల క్రికెట్ మరింత విస్తృతం అవుతుంది. ఈ జోరు ఇలాగే కొనసాగితే పురుషుల ను మించి పోతుంది మహిళల క్రికెట్.