Homeక్రీడలుMS Dhoni Captain: అందుకే ధోనీకి కెప్టెన్సీ బాధ్యతలు.. సీక్రెట్ బయట పెట్టిన నాటి సెలెక్టర్...

MS Dhoni Captain: అందుకే ధోనీకి కెప్టెన్సీ బాధ్యతలు.. సీక్రెట్ బయట పెట్టిన నాటి సెలెక్టర్ భూపేంద్ర సింగ్

MS Dhoni Captain: భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యేక స్థానం ఉంది. భారత జట్టుకు అపురూప విజయాలను అందించడమే కాకుండా టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇలా ఐసీసీ నిర్వహించిన మేజర్ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్ గా ధోని చరిత్ర సృష్టించాడు. చివరిసారిగా ధోని 2013లో ఛాంపియన్ ట్రోఫీని భారత జట్టుకు అందించి పెట్టాడు. ఆ తరువాత నుంచి భారత జట్టు ఆశించిన స్థాయిలో విజయాలను సాధించలేక చతికిలపడుతూ వస్తోంది. ఇప్పటి వరకు నిర్వహించిన అనేక మేజర్ టోర్నీల్లో నాలుగు సార్లు భారత జట్టు ఫైనల్స్ లో ఓడిపోగా, మరి కొన్నిసార్లు సెమీ ఫైనల్స్ లో వెనుదిరిగింది. ధోని తరువాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్లుగా బాధ్యతలను స్వీకరించి మెగా టోర్నీల్లో భారత జట్టును నడిపించారు. అయితే, వీరెవరూ ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీల్లో భారత జట్టును విజేతగా నిలపలేకపోయారు.

భారత జట్టు ధోని సారధ్యంలో గొప్ప విజయాలను నమోదు చేసింది. కీలక ట్రోఫీలను కూడా భారత జట్టు దక్కించుకుంది. ధోని తర్వాత మరో కెప్టెన్ ఆ స్థాయిలో ఐసీసీ ట్రోఫీలను అందించలేకపోతున్నారు. అయితే, భారత జట్టుకు గొప్ప విజయాలను అందించిన ధోనీని కెప్టెన్ గా తీసుకోవడం వెనుక ఉన్న కారణం గురించి తాజాగా భూపేంద్ర సింగ్ వెల్లడించారు. కెప్టన్ గా ధోనీని తీసుకోవడం వెనుక ఉన్న కారణాలను మీరూ చదివేయండి.

ఆ నైపుణ్యాలను చూసే కెప్టెన్ గా ఎంపిక..

ధోనిని కెప్టెన్ గా ఎంపిక చేయడానికి గల కారణాలను టీమిండియా మాజీ సెలెక్టర్ భూపేందర్ సింగ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెప్టెన్ ను జట్టు నుంచి నేరుగా ఎన్నుకోలేదని ఆయన స్పష్టం చేశాడు. మరిన్ని అంశాలను ప్రస్తావించిన ఆయన ఏమన్నారంటే.. ‘ ఒక ఆటగాడి బాడీ లాంగ్వేజ్, జట్టును ముందుండి నడిపించగలిగే లక్షణం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఇతర ప్లేయర్స్ తో మాట్లాడే విధానం వంటి విషయాల్లో నైపుణ్యాలను బట్టి కెప్టెన్ గా ఎన్నుకుంటారు. ఇలాంటి లక్షణాలను కెప్టెన్ కాకముందే నుంచే ధోనీ చాలా సార్లు కనబరిచాడు. ఆ విషయంలో మాకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది అందుకే కెప్టెన్ గా ఎంపిక చేశాం’ అని ఆయన వెల్లడించారు. కెప్టెన్ గా ఎంపిక చేసిన తర్వాత ధోని తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించాడు. ధోని మంచి ఆటగాడిగానే కాకుండా గొప్ప నాయకుడిగాను రాణించాడని ఈ సందర్భంగా ఆయన కితాబు ఇచ్చాడు.

ఆ స్థాయిలో విజయాలు అందించలేకపోతున్న కెప్టెన్లు..

ధోని తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారత జట్టు పగ్గాలను అందుకున్నారు. అయితే, ధోని స్థాయిలో ఎవరు నాయకత్వ లక్షణాలను ప్రదర్శించలేకపోతున్నారు. ధోని రిటైర్మెంట్ తర్వాత సీనియర్ ఆటగాళ్లలో విభేదాలు పెరిగాయి. ఇది కూడా జట్టు ఆటపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. వరల్డ్ కప్ ఓటమి తర్వాత కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలను వదులుకున్నాడు. అయితే, ఈ బాధ్యతలను స్వీకరించిన రోహిత్ శర్మ కూడా ఆశించిన స్థాయిలో జట్టును ముందుకు నడిపించలేకపోతున్నాడు. తాజాగా డబ్ల్యూటీసి ఫైనల్ లో భారత జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. వెస్టిండీస్ పర్యటన తర్వాత రోహిత్ శర్మపై కూడా వేటు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే రానున్న రోజుల్లో భారత జట్టును నడిపించబోయే కొత్త నాయకుడు ఎవరో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

RELATED ARTICLES

Most Popular