Sanju Samson: దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. బీభత్సంగా పరుగులు తీస్తాడు. తనదైన రోజు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. ఎంతటి బౌలర్ అయినా సరే ఏమాత్రం వెనకడుగు వేయడు.. దూకుడు మంత్రాన్ని , వేగవంతమైన తంత్రాన్ని అమలు చేస్తాడు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజు శాంసన్ సారధిగా వ్యవహరిస్తున్నాడు. సంజు అద్భుతమైన ఆటగాడయినప్పటికీ.. టీమిండియాలో అతనికి అవకాశాలు వస్తూ పోతూ ఉన్నాయి.
సంజు దక్షిణాఫ్రికా సిరీస్ లో తను ఏమిటో నిరూపించుకున్నాడు. శతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో అతడికి జట్టులో స్థానం స్థిరమైంది. దీనికి తోడు సంజు తండ్రి అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కొడుకు కెరియర్ తో ఆడుకున్నారని మండిపడ్డాడు. గౌతమ్ గంభీర్ ప్రధాన శిక్షకుడిగా వచ్చిన తర్వాత తన కొడుకుకు మంచి రోజులు వచ్చాయని సంజు తండ్రి పేర్కొన్నాడు.. అయితే ఇప్పుడు పరిస్థితి మాత్రం మరో విధంగా ఉంది.
మరికొద్ది రోజుల్లో టి20 వరల్డ్ కప్ మన దేశం వేదికగా జరగబోతున్న నేపథ్యంలో సంజు కెరియర్ డోలాయమానంలో పడినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే సంజు కు చోటు లభిస్తున్నప్పటికీ తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం లభించడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా సిరీస్లో అతడికి అవకాశం లభించినప్పటికీ.. తొలి టి20 మ్యాచ్లో మాత్రం ఆడే అవకాశం రాలేదు.. మేనేజ్మెంట్ గిల్, శివం దుబే, అక్షర్ పటేల్ వంటి వారికి మాత్రమే అవకాశం ఇవ్వడంతో సంజు రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావలసి వచ్చింది.. సంజు కు తుది జట్టులో అవకాశం లభించకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాలుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
టి20లో సంజు కు మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా మీద కూడా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది.. అయితే అంతటి చరిత్ర ఉన్నప్పటికీ సంజును మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. తుది జట్టులో చోటు ఇవ్వకుండా అతనితో ఆటలు ఆడుకుంటుంది. ఇలానే సంజుతో టీమిండియా మేనేజ్మెంట్ గేమ్స్ ఆడితే.. అతడు త్వరలోనే క్రికెట్ కు శాశ్వత వీడ్కోలు పలికే అవకాశం లేకపోలేదని అభిమానులు అంటున్నారు. తొలి మ్యాచ్లో విఫలమైన గిల్ ను పక్కనపెట్టి సంజు కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.