
సమ్మర్ లో క్రికెట్ ఫ్యాన్స్ కు కిక్కు ఇచ్చే ఐపీఎల్ మళ్లీ వచ్చేసింది. ఐదు నెలల క్రితం అరబ్ గడ్డపై అదరగొట్టిన క్రికెటర్లు ఈసారి భారత మైదానాల్లో చెలరేగేందుకు సిద్ధం అయ్యారు. కరోనా పంజా విసురుతున్న వేళ మరోసారి బయో బబుల్ లో ఖాళీ స్టేడియాల్లో ఖతర్నాక్ ఆటతో అభిమానులను అలరించబోతున్నారు.ఈ మెగా లీగ్ 14వ సీజన్ మరికొద్ది గంటల్లో షురూ కానుంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. కింగ్ విరాట్ కోహ్లీ మధ్య జరిగే మొదటి మ్యాచ్ తో 52రోజుల మెగా ఈవెంట్ కు తెర లేవనుంది.
ఐపీఎల్ ఆటకు వేళయ్యింది. టైటిల్ వేటకు రంగం సిద్ధం అయ్యింది. ఈ రెండింటికి ముందే పాజిటివ్ ల గోల మొదలైంది. డగౌట్ లో మాస్క్ లతో మైదానంలో బ్యాట్.. బాళ్లతో మెరుపుల లీగ్ రెడీ అవుతోంది. ఓ విధంగా ఇది క్రికెట్ కుంభమేళాగా మారబోతోంది. కానీ మరోసారి వైరస్ విజృంభణ నేపథ్యంలో మ్యాచ్ లను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా.. టీవీలకే అతుక్కు పోయే క్రికెట్ మేళా ఇది. ఐపీఎల్ అంటే.. బౌండరీ మీటరు.. పర్పుల్ క్యాప్.. ఆరెంజ్ క్యాప్ లే తారుమారు అయ్యేవి. కానీ ఇప్పుడు మహమ్మారి కేసులు, క్వారంటైన్లు, ఐసోలేషన్లు లీగ్ లో భాగం అయ్యాయి.
ఆటగాళ్లు మైదానంలో తేల్చుకుంటే.. మనం టీవీల ముందు వీక్షించాల్సిన పరిస్థితి ఇదీ.. ఎందుకంటే.. వైరస్ దాడిచేసేందుకు కాచుకు కూర్చుంది. గతానికి భిన్నంగా మన దేశంలో జరిగే ఐపీఎల్ పోటీలను మనం వెళ్లి చూడలేని పరిస్థితి. గతేడాది యూఏఈలో జరిగినా.. అది పరాయి గడ్డ.. కానీ మన నగరాల్లో మెరుపుల్లాంటి బ్యాటింగ్.. బౌలింగ్ ను వీక్షించే అవకాశం బుల్లితెర నుంచే పరిమితం.
స్టేడియంలో ఈలల గోల ఉండదు. ఆడే ఆటగాళ్లు.. తీర్పులిచ్చే అంపైర్లు.. ఖాళీ కుర్చీలు మాత్రమే కనిపిస్తాయి. అయితే ఆట బోసిపోదు. మెరుపుల పవర్ తగ్గదు. బౌలింగ్ పదును తగ్గదు. తొలిపంచ్ విసిరేందుకు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ సై అంటోంది. శుభారంభం చేసేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు యుద్ధానికి సిద్ధం అయ్యింది.