https://oktelugu.com/

Kapil Dev- MS Dhoni: కపిల్ దేవ్, ఎంఎస్ ధోనిలలో ఎవరు గొప్ప?

టీమిండియా మాజీ ఆటగాళ్లు, వరల్డ్ కప్ సాధించిన జట్టుకు మాజీ సారథులు కపిల్ దేవ్, మహేంద్రసింగ్ ధోని. వీరిద్దరూ జట్టుకు వరల్డ్ కప్ అందించిన హీరోలే. అయితే, క్రికెట్ అభిమానుల్లో వీరిద్దరిలో ఎవరు గొప్ప అన్న ప్రశ్న ఎప్పుడు ఉత్పన్నమవుతూనే ఉంటుంది.

Written By:
  • BS
  • , Updated On : July 10, 2023 / 08:35 AM IST

    Kapil Dev- MS Dhoni

    Follow us on

    Kapil Dev- MS Dhoni: భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ కలను నెరవేర్చిన సారథులు కపిల్ దేవ్, మహేంద్రసింగ్ ధోని. వీరిద్దరూ కోట్లాది మంది అభిమానుల ఆకాంక్షలను సాకారం చేశారు. భారతదేశానికి తొలి వరల్డ్ కప్ అందించిన ఘనతను కపిల్ దేవ్ దక్కించుకుంటే.. 28 ఏళ్ల తర్వాత ధోని సారథ్యంలో 2011లో మరోసారి భారత్ వరల్డ్ కప్ దక్కించుకుంది. అయితే, వరల్డ్ కప్ గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా.. దేశానికి వరల్డ్ కప్ అందించిన ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అన్న ప్రశ్న ఉత్పన్నమవుతూనే ఉంది.

    టీమిండియా మాజీ ఆటగాళ్లు, వరల్డ్ కప్ సాధించిన జట్టుకు మాజీ సారథులు కపిల్ దేవ్, మహేంద్రసింగ్ ధోని. వీరిద్దరూ జట్టుకు వరల్డ్ కప్ అందించిన హీరోలే. అయితే, క్రికెట్ అభిమానుల్లో వీరిద్దరిలో ఎవరు గొప్ప అన్న ప్రశ్న ఎప్పుడు ఉత్పన్నమవుతూనే ఉంటుంది. ధోని గొప్ప అంటే.. కాదు కాదు కపిల్ దేవ్ అంటూ అభిమానుల మధ్య ఎప్పుడూ వాదనలు జరుగుతూనే ఉంటాయి. ఇద్దరూ దేశానికి వరల్డ్ కప్ అందించిన గొప్ప సారథులు.. అంతకు మించి గొప్ప క్రికెటర్లు కూడా. ఎవరు గొప్పతనం వారిది. ఎవరి ప్రతిభ వారిది. ఇద్దరినీ ఒకే విధంగా చూడడం కష్టం. కానీ, ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయంపై తేల్చాల్సి వస్తే మాత్రం.. కపిల్ దేవ్ వైపు కొంత మొగ్గు కనిపిస్తుంది అని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.

    ఆటగాడిగానే కాకుండా నాయకుడిగా కూడా..

    భారత క్రికెట్ జట్టు 1983లో నిర్వహించిన వరల్డ్ కప్ లో గొప్ప పోరాటంతో విజయం సాధించింది. టోర్నీలో అండర్ డాగ్స్ గా బరిలోకి దిగి ద్వితీయమైన విజయాలతో భారత జట్టు ఏకంగా టైటిల్ ను కైవసం చేసుకుంది. ఫైనల్లో పటిష్టమైన వెస్టిండీస్ జట్టుపై ఘన విజయాన్ని నమోదు చేసింది. అయితే, ఈ విజయం వెనుక జట్టులోని ఆటగాళ్ల సమష్టి ప్రదర్శనతోపాటు.. కెప్టెన్ కపిల్ దేవ్ నిర్ణయాలు, ఆటగాళ్లకు అందించిన ప్రోత్సాహం, కెప్టెన్ గానే కాకుండా ఆటగాడిగాను అద్భుతమైన ప్రదర్శనతో జట్టుకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించి పెట్టాడు. ఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ పై ఎనిమిది బంతుల్లో మూడు ఫోర్లు సహాయంతో 15 పరుగులు చేసిన కపిల్ దేవ్.. బౌలింగ్ లోను అద్వితీయమైన ప్రదర్శనతో అలరించాడు. 11 ఓవర్లు బౌలింగ్ చేసిన కపిల్ దేవ్ నాలుగు ఓవర్లు మేడిన్ చేయడంతోపాటు 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అలాగే, అద్భుతమైన ఫీల్డింగ్ తో అదరగొట్టాడు కపిల్ దేవ్. రిచర్డ్స్, క్లెవ్ లాయిడ్ క్యాచ్ లు అందుకుని భారత జట్టుకు అపురూపమైన విజయాన్ని అందించి పెట్టాడు. ముఖ్యంగా భారత జట్టుకు ప్రమాదకరంగా పరిణమిస్తున్న రిచర్డ్స్ క్యాచ్ ను కపిల్ దేవ్ పట్టిన తీరును ఇప్పటికీ క్రికెట్ అభిమానులు మర్చిపోలేరు. ఈ క్యాచ్ తో మ్యాచ్ ను పూర్తిగా భారత వైపు మలుపు తిప్పాడు. అలాగే, 2011 నాటి టీమిండియాతో పోలిస్తే 1983లో భారత జట్టు అత్యంత బలహీనమైనది. అయినప్పటికీ జట్టులోని ఆటగాళ్లలో స్థైర్యాన్ని పెంపొందించేలా చేసి పటిష్టమైన జట్లను ఓడించడంలో కపిల్ దేవ్ చాకచక్యంగా వ్యవహరించాడు. ఆటగాడిగా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణిస్తూ, కెప్టెన్ గాను తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులకు చెక్ చెప్పి తొలిసారి భారత జట్టు వరల్డ్ కప్ విజయం సాధించేలా చేశాడు.

    తీసివేయలేని స్థాయిలో ప్రతిభ చూపిన ధోని..

    1983 లో భారత జట్టు సాధించిన విజయం గొప్పదే. కానీ, 2011లో ధోని సారథ్యంలో భారత జట్టు సాధించిన విజయాన్ని సులభంగా తీసేయడానికి కూడా లేదు. భారత జట్టు బలమైనదే అయినప్పటికీ.. అంతకుమించిన బలమైన జట్లు 2011 వరల్డ్ కప్పులో ఉన్నాయి. ఈ టోర్నీ మొత్తం అద్భుతమైన కెప్టెన్సీ తో ధోని అదరగొట్టాడు. ఫైనల్ మ్యాచ్ లో 79 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్స్లు సహాయంతో 91 పరుగులు చేసిన ధోని శ్రీలంక విధించిన 275 పరుగుల భారీ లక్ష్యాన్ని సులభంగా చేదించడంలో కీలకంగా వ్యవహరించాడు. ఫైనల్ మ్యాచ్ లో ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గాను తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులకు చెక్ చెప్పి భారత జట్టు టైటిల్ కైవసం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించాడు. అయితే నాటి భారత జట్టు పరిస్థితితో పోలిస్తే మెరుగ్గా 2011 నాటి భారత్ జట్టు ఉండటం వల్లే కపిల్ దేవ్, ధోనీల్లో కపిల్ దేవ్ కు అగ్రస్థానాన్ని ఇవ్వొచ్చని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.