Rohit And Virat Kohli: అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో మొదలయ్యే వన్డే సిరీస్ లో ప్రధాన దృష్టి మొత్తం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మీద మాత్రమే ఉంది. మన దేశ మీడియా మాత్రమే కాదు, చివరికి ఆస్ట్రేలియా మీడియా సైతం వీరిద్దరి మీదనే ఫోకస్ చేసింది. వీరిద్దరి రికార్డులు, ఇతర అంశాల మీద ఆస్ట్రేలియా మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను, వారిని చూసేందుకు వచ్చిన అభిమానులను పదేపదే ప్రస్తావిస్తోంది. ఒక రకంగా ఆస్ట్రేలియా గడ్డమీద ఆ జట్టు ఆటగాళ్ల కంటే మన జట్టు ప్లేయర్లకు కంగారు మీడియా ప్రాధాన్యం ఇవ్వడం నిజంగా టీమిండియా కు గర్వకారణం.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్, టి20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. వన్డే ఫార్మాట్లో మాత్రమే వారిద్దరు ఆడుతున్నారు. 2027 వరల్డ్ కప్ ను లక్ష్యంగా పెట్టుకున్న మేనేజ్మెంట్ రోహిత్ శర్మ ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. దీంతో అతడు నార్మల్ ప్లేయర్ గానే కొనసాగుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడు వన్డే ఆడింది లేదు. ఆ మాటకొస్తే విరాట్ కోహ్లీ కూడా ఆడలేదు. చాలా నెలల గ్యాప్ తర్వాత వీరిద్దరూ ఆడుతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఆస్ట్రేలియా గడ్డమీద వీరిద్దరికీ మెరుగైన రికార్డులు ఉన్నాయి. రోహిత్ శర్మ ఆస్ట్రేలియా జట్టు మీద ఏకంగా డబుల్ సెంచరీ సాధించిన ఘనతను కలిగి ఉన్నాడు. అటువంటి రోహిత్, విరాట్ ఇప్పుడు వన్డే సిరీస్ లో ఆడుతున్న నేపథ్యంలో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు..
మరోవైపు అజిత్ అగర్కర్ లాంటి వ్యక్తులు మాత్రం విభిన్నంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ గనుక సెంచరీలు చేసినప్పటికీ 2027 వరల్డ్ కప్ లో వారికి చోటు ఉంటుందని నమ్మకాన్ని ఇవ్వలేమని చెప్పాడు. ఒకవేళ ఆ ప్రకారమే విరాట్, రోహిత్ ఆడినప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండదు. ఒకవేళ వారిద్దరు గనుక విఫలమైతే అప్పుడు పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.. వారిద్దరు గనుక పరుగులు చేయకపోతే జట్టులో స్థానం కష్టమవుతుందని.. ఏదో ఒక రూపంలో మేనేజ్మెంట్ వారిపై ఒత్తిడి తీసుకొచ్చి రిటైర్మెంట్ ప్రకటించేలా చేస్తుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆస్ట్రేలియా జట్టు మీద వీరిద్దరికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. విరాట్, రోహిత్ చెరి ఐదు సెంచరీలను ఆస్ట్రేలియా జట్టు మీద చేశారు. ఆస్ట్రేలియా జట్టు మీద రోహిత్ శర్మ ఏకంగా డబుల్ సెంచరీ కూడా చేశాడు. ఇక విరాట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోహిత్ ప్రస్తుతం సన్నగా మారిపోయాడు. విరాట్ కూడా చాలా రోజుల తర్వాత వన్డే ఫార్మాట్ ఆడుతున్నాడు. వీరిద్దరిపై భారీగా అంచనాలు ఉన్న నేపథ్యంలో ఎలా ఆడతారనే ఆసక్తి సర్వత్రా ఉంది.