IPL 2024: ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంది. అద్భుతమైన ఆటతీరుతో అభిమానులకు ఆటగాళ్లు ఆనందాన్ని పంచుతున్నారు. ఇప్పటికే ఈ టోర్నీలో కోల్ కతా, రాజస్థాన్, హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్ వెళ్లిపోయాయి. ఇక చివరి స్థానం కోసం బెంగళూరు, చెన్నై పోటీ పడుతున్నాయి. అయితే ఈ రెండు జట్లలో ఎవరిని అదృష్టం వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఒకరకంగా ఇది నాకౌట్ లాంటి మ్యాచ్. ఇందులో ఏ జట్టు అయితే గెలుస్తుందో.. అది కచ్చితంగా ప్లే ఆఫ్ వెళ్లిపోతుంది.
ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభ మ్యాచ్ చెన్నై, బెంగళూరు జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో చెన్నై గెలిచింది. ఇక బెంగళూరు మొదటి స్పెల్ లో వరుసగా ఓటములు ఎదుర్కొంది. దీంతో ఆ జట్టు లీగ్ దశలోనే ఇంటికి వెళ్తుందని అందరూ భావించారు. కానీ దెబ్బతిన్న బెబ్బలిలా ఆ జట్టు తిరిగి తేరుకుంది. సరికొత్త ఆట తీరును ప్రదర్శించింది. వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ రేసులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆ జట్టు పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ వెళ్లాలంటే ఆ జట్టు చెన్నై పై కచ్చితంగా గెలవాలి.. గెలవడం మాత్రమే కాదు రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి.
చెన్నై తో జరిగే మ్యాచ్లో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేసి 200 రన్స్ టార్గెట్ ఇస్తే.. రుతు రాజ్ గైక్వాడ్ సేనను 182 పరుగులకే కట్టడి చేయాలి. ఒకవేళ వర్షం వచ్చి ఎంపైర్లు ఓవర్లను కుదిస్తే.. 10 ఓవర్లలో బెంగళూరు 130 రన్స్ చేయాలి.. చెన్నై జట్టును 112 పరుగులకు ఆలౌట్ చేయాలి. ఒకవేళ బెంగళూరు చేజింగ్ కు దిగితే.. చెన్నై 201 రన్స్ టార్గెట్ విధిస్తే.. దానిని 18.1 ఓవర్లలో చేదించాలి. ఒకవేళ 10 ఓవర్లలో 131 రన్స్ టార్గెట్ చేదించాల్సి వస్తే.. 8.1 ఓవర్లలో దానిని పూర్తి చేయాలి. అప్పుడే ఆ జట్టు మెరుగైన రన్ రేట్ తో ప్లే ఆఫ్ వెళుతుంది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానాన్ని ఆక్రమిస్తుంది.
బెంగళూరు ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడింది. ఇందులో ఆరు విజయాలను సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో కొనసాగుతోంది. 0.387 నెట్ రన్ రేట్ ను కలిగి ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో దూకుడును ప్రదర్శిస్తోంది. ఇక చెన్నై జట్టు 13 మ్యాచులు ఆడగా.. ఏడు విజయాలు సొంతం చేసుకుంది.0.528 నెట్ రన్ రేట్ ను కలిగి ఉంది. గత సీజన్లో చెన్నై జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో అటు బెంగళూరు, ఇటు చెన్నై బలంగా కనిపిస్తున్నాయి. రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉంటుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.