Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు టీమిండియాలో ఆడే అవకాశం లభించింది. వీరిద్దరూ టెస్ట్, టి20 ఫార్మాట్ నుంచి తప్పుకున్న తర్వాత వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నారు. చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా వన్డే సిరీస్ ఆడలేదు. దీంతో వీరిద్దరి ఆట చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సిరీస్ ద్వారా మళ్లీ రోహిత్, విరాట్ మైదానంలో అడుగు పెట్టారు. సుదీర్ఘకాలం తర్వాత ఇద్దరు క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పైగా ఆస్ట్రేలియా జట్టు మీద కావడంతో అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు.
తొలి రెండు వన్డేలలో విరాట్ కోహ్లీ సున్నా పరుగులకు అవుట్ అయ్యాడు. తొలి వన్డేలో రోహిత్ విఫలమయ్యాడు. అయితే రెండో వన్డేలో రోహిత్ హాఫ్ సెంచరీ చేశాడు. మూడో వన్డేలో అజేయంగా సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ కూడా రెండు వన్డేలలో విఫలమైనప్పటికీ.. మూడో మ్యాచ్లో అజేయమైన హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో వీరిద్దరూ 2027 వరల్డ్ కప్ వరకు ఆడతారని ప్రచారం జరిగింది. ఈ విషయంలో విరాట్, రోహిత్ కూడా క్లారిటీ ఇవ్వడంతో అభిమానులకు అనుమానం అనేది లేకుండా పోయింది. అయితే ఇప్పుడు మరో ప్రశ్న కూడా మీడియాలో వినిపిస్తోంది. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్, విరాట్ కనిపించేది ఎప్పుడు?
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ పూర్తయింది. రోజులవ్యవధిలో టి20 సిరీస్ మొదలు కాబోతోంది. టి20 సిరీస్ పూర్తయిన తర్వాత నవంబర్ చివర్లో దక్షిణాఫ్రికా జట్టుతో టీమ్ ఇండియా 3 వన్డేల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత డిసెంబర్ నెలలో కివీస్ జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. ఈ మధ్యలో రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలు ఆడే అవకాశం రోహిత్, విరాట్ కు లభిస్తుంది.
రంజిత్రోఫీలో కూడా ఎలైట్, ప్లేట్ గ్రూప్ మ్యాచులు నిర్వహిస్తున్నారు. వచ్చేనెల 1వ తేదీ నుంచి ఎలైట్ విభాగంలో ముంబై, ఢిల్లీ జట్లు పోటీ పడతాయి. ఈ రెండు జట్లకు రోహిత్, విరాట్ ప్రాతినిధ్యం కనుక వహిస్తే ఖచ్చితంగా అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. అంతేకాదు వీరిద్దరికి కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ లభిస్తుంది. ఇక వచ్చే ఏడాది జూలైలో టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో 3 వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం ఇంకా కొన్ని జట్లతో కూడా వన్డే సిరీస్ ఆడాల్సి ఉంటుంది.