West Indies Vs New Zealand: వెస్టిండీస్ చేతిలో ఓటమి.. టి20 వరల్డ్ కప్ లో కివీస్ కథ ముగిసినట్టే..

గురువారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 రన్స్ చేసింది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ మైదానాలపై ఇదే హైయెస్ట్ స్కోర్..

Written By: Anabothula Bhaskar, Updated On : June 13, 2024 12:36 pm

West Indies Vs New Zealand

Follow us on

West Indies Vs New Zealand: ఇంతవరకు ఐసీసీ కప్ సాధించకపోయినప్పటికీ.. మెగా టోర్నీలలో న్యూజిలాండ్ అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది.. లీగ్, సూపర్ -8, సెమీస్, ఫైనల్ దాకా వస్తూ ఉంటుంది. ఇంతవరకు న్యూజిలాండ్ జట్టు ఐసిసి టోర్నీలలో దారుణమైన ప్రదర్శన చేసిన దాఖలాలు లేవు. 2021 టి20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ రన్నరప్ గా నిలిచింది.. అలాంటి జట్టు ప్రస్తుత వరల్డ్ కప్ లో లీగ్ దశలోనే ఇంటికి వెళ్లే దాఖలాలు కనిపిస్తున్నాయి.. తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. కీలకమైన రెండవ మ్యాచ్ లోనూ ఓటమిపాలైంది.. ఆతిథ్య వెస్టిండీస్ జట్టును నిలువరించలేక పరాజయం పాలైంది. మరోవైపు హ్యాట్రిక్ విజయాల సాధించిన వెస్టిండీస్ సూపర్ -8 కు వెళ్లిపోయింది. వరుస పరాజయాలతో న్యూజిలాండ్ తన సూపర్ -8 అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది.

గురువారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 రన్స్ చేసింది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ మైదానాలపై ఇదే హైయెస్ట్ స్కోర్.. వెస్టిండీస్ బ్యాటర్ రూథర్ ఫోర్డ్ (39 బంతుల్లో 68) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో వెస్టిండీస్ 150 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది. 150 పరుగుల టార్గెట్ తో న్యూజిలాండ్ బరిలోకి దిగింది.

20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 9 వికెట్లు కోల్పోయి, 139 పరుగులు మాత్రమే చేసింది. 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గ్లెన్ ఫిలిప్స్ (40), మిచెల్ సాంట్నర్(21*: 12 బంతుల్లో మూడు సిక్సర్లు), ఫిన్ అలెన్(26) దూకుడుగా ఆడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. జోసెఫ్ 4/19, మోతీ 3/25 అద్భుతంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు.

ఇక ప్రస్తుతం సీ గ్రూప్ లో వెస్టిండీస్ మూడు మ్యాచ్లు గెలిచి, 6 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. +2.596 నెట్ రన్ రేట్ తో మొదటి స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్ తో సంబంధం లేకుండా నేరుగా సూపర్ -8 లోకి వెళ్లిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్లు గెలిచి, ఖాతాలో నాలుగు పాయింట్లు, +5.225 నెట్ రన్ రేట్ తో రెండవ స్థానంలో కొనసాగుతోంది.. న్యూజిలాండ్ -2.425 నెగిటివ్ నెట్ రన్ రేట్ తో కొనసాగుతోంది. ఒకవేళ తన చివరి మ్యాచ్లో గెలిచినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్ రన్ రేట్ ను న్యూజిలాండ్ అధిగమించడం దాదాపు అసాధ్యం. ఫలితంగా గ్రూప్ సీ నుంచి వెస్టిండీస్ ఇప్పటికే సూపర్ -8 లోకి వెళ్లిపోగా.. వెస్టిండీస్ తర్వాత స్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ సూపర్ -8 కు వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది.

గురువారం వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. వెస్టిండీస్ బ్యాటర్ల దూకుడును అడ్డుకోలేకపోయింది. అందువల్లే ఆ జట్టు 149 పరుగులు చేసింది.. బ్యాటింగ్ లోనూ ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా ఆటగాళ్లు తేలిపోయారు. అందువల్లే న్యూజిలాండ్ ఓడిపోవాల్సి వచ్చింది. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కివీస్ దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.. ఆ మ్యాచ్ లో కనుక న్యూజిలాండ్ గెలిస్తే ఇక్కడిదాకా వచ్చేది కాదు. తొలిసారిగా గ్రూప్ దశ నుంచే న్యూజిలాండ్ ఇంటికి వెళ్లిపోవడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.