West Indies vs South Africa : నిండా ముంచిన వాన.. ఆతిథ్య వెస్టిండీస్ కలలు కల్లలు.. ఒత్తిడి జయించి సెమీస్ కు సౌతాఫ్రికా

West Indies vs South Africa సాధారణంగా ప్రపంచకప్ లో ఒత్తిడి తట్టుకోలేక కీలకమైన క్వార్టర్, సెమీఫైనల్స్ లో సౌతాఫ్రికా ప్రతీసారి ఓడిపోతుంటుంది. వీరి కప్ కల అందనంత దూరంగా ఉంటుంది.

Written By: NARESH, Updated On : June 24, 2024 12:01 pm

West Indies vs South Africa

Follow us on

West Indies vs South Africa : ఆతిథ్య వెస్టిండీస్ కలలు కల్లలయ్యాయి. టి20 వరల్డ్ కప్ ను మూడో సారి సాధించాలనే ఆ జట్టు ఆశలు అడియాసలయ్యాయి. సౌత్ ఆఫ్రికా జట్టుతో సోమవారం జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో వెస్టిండీస్ ఓడిపోయింది.. ఉత్కంఠ పోరులో సౌత్ ఆఫ్రికా ఎదుట చేతులెత్తేసింది. మరోవైపు వర్షం కూడా ఆటంకం కలిగించడంతో గ్రూప్ -2 లో టేబుల్ టాపర్ గా సౌత్ ఆఫ్రికా సెమీస్ లోకి ప్రవేశించింది. కేవలం రెండు పాయింట్లు మాత్రమే కలిగి ఉండడంతో.. వెస్టిండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పటికే ఇంగ్లాండ్ గ్రూప్ -2 నుంచి సెమీస్ వెళ్ళిపోయింది. మందకొడిగా ఉన్న ఈ మైదానంపై ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. చేజ్ 42 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 52 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.. దక్షిణాఫ్రికా బౌలర్ షంసి 3/27 తో సత్తా చాటాడు..

అనంతరం 136 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు.. రెండు ఓవర్లలో 15 పరుగులు చేసి, రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలోనే వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు ఓవర్లను కుదించారు. దీంతో దక్షిణాఫ్రికా విజయ లక్ష్యాన్ని 17 ఓవర్లకు 124 పరుగులుగా నిర్ణయించారు.. అసలే మందకొడి మైదానం.. ఇలాంటి పిచ్ పై ప్రతి పరుగు అత్యంత అవసరం. వర్షం ఎంట్రీ ఇవ్వడంతో సౌత్ఆఫ్రికా జట్టుకు మూడు ఓవర్లతో పాటు, 12 పరుగుల లక్ష్యం తగ్గింది. అయితే 124 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఈ గెలుపు దక్షిణాఫ్రికా జట్టుకు అంత ఈజీగా లభించలేదు. మ్యాచ్ చివరి వరకు కూడా ఉత్కంఠ గా సాగింది. వెస్టిండీస్ ఆటగాళ్ల ప్రతిభ ప్రేక్షకులను మునివేళ్ళ మీద నిలబెట్టేలా చేసింది.

ముఖ్యంగా వెస్టిండీస్ బౌలర్ రసెల్ రెండో ఓవర్లో డికాక్ (12; ఏడు బంతుల్లో మూడు ఫోర్లు), హెండ్రిక్స్(0) ను అత్యంత తెలివిగా పెవిలియన్ పంపించాడు. ఈలోపు వర్షం తగ్గిన తర్వాత మార్క్రం(18), స్టబ్స్(29) దూకుడుగా ఆడారు. ఇదే సమయంలో మార్క్రం ఔటయ్యాడు. అనంతరం వచ్చిన క్లాసెన్(22: పది బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా ఆడటంతో సౌత్ ఆఫ్రికా విజయం వైపు పరుగులు తీసింది. ఈ దశలో వెస్టిండీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా ఆ జట్టు తిరిగి పోటీలోకి వచ్చింది. మెరుగ్గా బౌలింగ్ చేస్తూ విన్నింగ్ ఈక్విటీ ని 12 బంతుల్లో 13 పరుగులుగా మార్చారు. ఈ దశలో బంతి అందుకున్న చేజ్ 16 ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే చివరి బంతిని దక్షిణాఫ్రికా ఆటగాడు రబాడ బౌండరీ కొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికా విజయానికి చివరి ఓవర్లో ఐదు పరుగులు కావాల్సి వచ్చింది. జాన్సన్ (21*) తొలి బంతికే భారీ సిక్సర్ కొట్టి వెస్టిండీస్ కు పరాభవాన్ని మిగిల్చాడు. ఇదే సమయంలో సౌత్ఆఫ్రికా ను సెమీస్ చేర్చాడు. ఈ విజయంతో వెస్టిండీస్ ఆటగాళ్లు నిర్వేదంలో మునిగిపోగా.. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సంబరాల్లో తేలిపోయారు.

సాధారణంగా ప్రపంచకప్ లో ఒత్తిడి తట్టుకోలేక కీలకమైన క్వార్టర్, సెమీఫైనల్స్ లో సౌతాఫ్రికా ప్రతీసారి ఓడిపోతుంటుంది. వీరి కప్ కల అందనంత దూరంగా ఉంటుంది. అందుకే ప్రపంచ క్రికెట్ లో సౌతాఫ్రికాను చౌకర్స్ అని పిలుస్తారు. కానీ ఈసారి మాత్రం జాన్ సెన్, స్టబ్స్ పట్టుదలగా ఆడి.. ఒత్తిడిని తట్టుకొని నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చారు. సౌతాఫ్రికాను సెమీస్ చేర్చారు.