Afghanistan Cricket Team : టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శనను కాస్త పక్కన పెడితే.. ఈ టోర్నీలో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిన జట్టుగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. ఏకంగా ఆ జట్టు సెమీస్ దాకా వచ్చింది. సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయినప్పటికీ.. గ్రూప్, సూపర్ -8 దశల్లో సూపర్బ్ ఆట తీరు ప్రదర్శించింది. ముఖ్యంగా సూపర్ – 8 లో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది. అండర్ డాగ్స్ గా టోర్నీలోకి అడుగుపెట్టిన ఆ జట్టు సంచలన ప్రదర్శనతో సెమిస్ దాకా వచ్చింది. పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వంటి మేటిజట్లు ఇంటిదారి పడితే.. ఆఫ్ఘనిస్తాన్ మాత్రం అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి ఆప్ఘనిస్తాన్ ఈ స్థాయిలో ప్రదర్శన చూపింది కాబట్టి.. కచ్చితంగా తాలిబన్లు ఆ దేశంలో క్రికెట్ క్రీడకు పెద్దపీటవేస్తారని అందరూ భావించారు. ఆటగాళ్లకు ప్రోత్సాహకాలు అందిస్తారని అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఆ దేశంలో జరుగుతోంది. ఏకంగా క్రికెట్ పై నిషేధం విధించే దిశగా అడుగులు పడుతున్నాయి.. గ్లోబల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం తాలిబన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా దేశంలో క్రికెట్ ను బ్యాన్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
క్రికెట్ చెడు వాతావరణాన్ని సృష్టిస్తోందట
ఆఫ్ఘనిస్తాన్ లో క్రికెట్ చెడు వాతావరణాన్ని సృష్టిస్తుందని తాలిబన్లు ఆరోపిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. క్రికెట్ షరియా చట్టానికి పూర్తి విరుద్ధం. అందువల్లే ఈ ఆటను దేశంలో నిషేధిస్తున్నట్టు తాలిబన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా నిర్ణయించినట్టు తెలుస్తోంది.. అమెరికా దళాలు వెళ్లిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో అనేక మార్పులను తీసుకురావడం ప్రారంభించారు. మహిళలకు స్వేచ్ఛ లేకుండా చేశారు. వారికి చదువును దూరం చేశారు. ఆటలను ఆడే వీల్లేకుండా చేశారు. ఇప్పుడు పురుషులపై కూడా పడ్డారు. క్రికెట్ ఆడకుండా నిలిపివేయాలని భావిస్తున్నారు. తాలిబన్లు తీసుకున్న ఈ నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆఫ్గన్ క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. అయితే ఈ నిషేధం ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందనేది తెలియ రాలేదు. ” క్రికెట్ పై తాలిబన్లు నిషేధం విధించే దిశగా ఉన్నారు. వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఇప్పటికైతే చెప్పలేము. కాకపోతే వారికి క్రికెట్ ఆటపై సానుకూల దృక్పథం లేదు. తమ చట్టాలకు వ్యతిరేకంగా ఉందని వారు భావిస్తున్నారు. అందువల్లే క్రికెట్ ఆడకుండా నిషేధం విధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందని విషయాన్ని మాత్రం చెప్పలేమని” గ్లోబల్ మీడియా తన కథనాల ద్వారా అభిప్రాయపడుతోంది.