IND VS NZ 2nd Test Match : బెంగళూరు ఓటమి టీమిండియాకు గుణపాఠం నేర్పింది.. అందుకే పూణే టెస్టులో వారికి అవకాశం.. అనిల్ కుంబ్లే, సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు..

టీమిండియా, న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరులో ఇటీవల జరిగిన తొలి టెస్ట్ లో ఓటమిపాలైంది. 8 వికెట్ల తేడాతో పరాజయాన్ని పొందింది. ఈ ఓటమి భారత జట్టుకు అనేక గుణపాఠాలను నేర్పింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 24, 2024 12:17 pm

IND VS NZ 2nd Test Match

Follow us on

IND VS NZ 2nd Test Match : పూణే వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు అనేక మార్పులు చేర్పులు చేసింది. వాషింగ్టన్ సుందర్ కు చోటు దక్కింది.. అక్షర్ పటేల్ చోటు లభిస్తుందనుకున్నప్పటికీ.. అతడు రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్యాడు. తొలి టెస్ట్ లో ఓటమి నేపథ్యంలో టీమిండియా తీవ్రమైన ఒత్తిడికి గురైంది.. అందువల్లే అనేక మార్పులు తీసుకొచ్చింది. కేఎల్ రాహుల్, కులదీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసింది. ఆకాష్ దీప్, గిల్ కు అవకాశం లభించింది. మెడ నొప్పి వల్ల గిల్ తొలి టెస్ట్ కు దూరమయ్యాడు. అయితే అతడు లేని లోటు తొలి టెస్ట్ లో టీమిండియా కు తెలిసి రావడంతో.. రెండో టెస్టుకు అతడిని వెంటనే పిలిచారు. ఆకాష్ దీప్ ను రెండవ పేస్ బౌలర్ గా నియమించారు. తొలి టెస్ట్ లో సిరాజ్ పెద్దగా ప్రతిభ చూపించలేకపోవడంతో.. రెండో టెస్టులో అతడిని పక్కన పెట్టారు. వాషింగ్టన్ సుందర్ జట్టులో స్థానం సంపాదించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదే విషయంపై టీమ్ ఇండియా మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే తమ మనోగతాన్ని వెల్లడించారు. రెండో టెస్ట్ ప్రారంభమైన తర్వాత.. టీమిండియాలో జరిగిన మార్పులు, చేర్పులపై వారిదైన విశ్లేషణ చేశారు. ” 2021 తర్వాత టీమిండియా టెస్ట్ జట్టులోకి వాషింగ్టన్ సుందర్ కు అవకాశం లభించింది. అక్షర్ పటేల్ కంటే అతడు మెరుగ్గా ఆడతాడని భావించి…ఆల్ రౌండర్ విభాగంలో అతన్ని ఎంపిక చేశారు. తొలి టెస్ట్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆల్ అవుట్ అయింది. కేఎల్ రాహుల్ ను రెండవ టెస్టుకు కూడా ఎంపిక చేస్తారని మేము భావించాం. గౌతమ్ గంభీర్ మద్దతు కూడా అతడికే ఉంది. కానీ అతడు అందరూ ఊహించినట్టుగానే రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్యాడు. తొలి టెస్ట్ లో సర్ఫరాజ్ 150 పరుగులు చేసిన నేపథ్యంలో అతడికి రెండో టెస్టు లోనూ అవకాశం లభించింది.. తొలి టెస్ట్ ఓటమి నేపథ్యంలో భారత జట్టు మూడు మార్పులు చేసింది. ఇది మాకు నిజంగానే ఆశ్చర్యం కలిగించినప్పటికీ.. వాషింగ్టన్ సుందర్ కంటే అక్షర్ పటేల్ కు అవకాశం ఇస్తే బాగుండేదేమో.. ఎందుకంటే అతడు టీమిండియా భవిష్యత్తు ఆశా కిరణం కాగలడని” గవాస్కర్, అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించారు.

బంతి మెలికలు తిరుగుతోంది

పూణే టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అందరు ఊహించినట్టుగానే ఈ స్పిన్ వికెట్ పై బంతి మెలికలు తిరుగుతోంది. బుమ్రా, ఆకాశ్ దీప్ మెరుగ్గా బౌలింగ్ వేసినప్పటికీ.. రవిచంద్రన్ అశ్విన్ న్యూజిలాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. బంతిని తనదైన శైలిలో మెలికలు తిప్పుతూ వికెట్లు పడగొడుతున్నాడు. కెప్టెన్ టామ్ లాథమ్(15) ను వికెట్ల మందు అశ్విన్ దొరకబుచ్చుకున్నాడు. మరో ఆటగాడు విల్ యంగ్ (18) ని అద్భుతమైన బంతితో అశ్విన్ బోల్తా కొట్టించాడు. అశ్విన్ వేసిన బంతిని ఊహించని యంగ్ స్లిప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అది కాస్త బ్యాట్ అంచు తగిలి కీపర్ పంత్ చేతిలో పడింది. దీంతో న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. 32 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. 76 పరుగుల వద్ద రెండవ వికెట్ నష్టపోయింది.. ప్రస్తుతం క్రీజ్ లో కాన్వే(42), రచిన్ రవీంద్ర (4) ఉన్నారు.