https://oktelugu.com/

India Vs Bangladesh: విరాట్ , రోహిత్ ఫామ్ కోల్పోయారా? స్పిన్ బౌలింగ్ ను ఒకప్పటిలాగా ఎదుర్కోలేకపోతున్నారా? గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..

టీమిండియాలో స్టార్ ఆటగాళ్లు ఎవరు? అనే ప్రశ్న వచ్చినప్పుడు కచ్చితంగా విరాట్, రోహిత్ పేర్లు స్ఫురణ లోకి వస్తాయి. అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన ఘనత వారి సొంతం. ఇటీవల టీమిండియాకు టి20 వరల్డ్ కప్ అందించిన రికార్డు కూడా వారి పాదాక్రాంతం. అయితే అలాంటి ఆటగాళ్లు తేలిపోతున్నారా? టెస్ట్ క్రికెట్లో ఆడలేకపోతున్నారా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానాలు వస్తున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 18, 2024 / 02:24 PM IST

    India Vs Bangladesh

    Follow us on

    India Vs Bangladesh: సమకాలిన టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు మెరుగైన రికార్డులు ఉన్నాయి. వీరిద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తారు. ఎలాంటి బౌలింగ్ నైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. టెస్ట్ క్రికెట్లను ధారాళంగా పరుగులు తీస్తారు. అయితే అలాంటి ఆటగాళ్లు గత కొద్ది రోజులుగా ఫామ్ కోల్పోయారా? స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లలో స్పిన్ బౌలర్ల ముందు తేలిపోతున్నారా? అనే ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2016 నుంచి 2020 వరకు స్వదేశంలో జరిగిన టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లలో స్వర్ణ యుగాన్ని అనుభవించారు.. ఆ కాలంలో రోహిత్ శర్మ 92.83 సగటుతో పరుగులు సాధించాడు. స్పిన్ బౌలర్ల బౌలింగ్లో కేవలం ఐదు సార్లు మాత్రమే అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 103.23 సగటుతో పరుగులు చేశాడు. స్పిన్ బౌలర్ల బౌలింగ్లో 13 సార్లు అవుట్ అయ్యాడు. గత మూడు సంవత్సరాలలో విరాట్, రోహిత్ శర్మ విషయంలో లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఈ కాలంలో స్వదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో రోహిత్ శర్మ 15 సార్లు స్పిన్నర్ల బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అతడి సగటు కూడా 44.13కి పడిపోయింది. ఇక విరాట్ కోహ్లీ స్వదేశంలో స్పిన్నర్ల బౌలింగ్లో 15 సార్లు అవుట్ అయ్యాడు. అతడి బ్యాటింగ్ సగటు 32.26 మాత్రమే ఉంది.

    ముఖ్యమైన ఆటగాళ్లుగా ఎదిగారు

    ఇక గణాంకాల ప్రకారం గత మూడు సంవత్సరాల లో ఈ యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, గిల్ వంటి ఆటగాళ్లు స్వదేశంలో అత్యుత్తమ క్రికెటర్లుగా ఎదిగారు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ ను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. యశస్వి జైస్వాల్ స్పిన్నర్ల బౌలింగ్లో ఇప్పటివరకు ఐదు సార్లు మాత్రమే అవుట్ అయ్యాడు. అతడు 115 బ్యాటింగ్ సగటు కొనసాగిస్తున్నాడు. రిషబ్ పంత్ స్పిన్ బౌలర్లపై అసాధారణంగా రాణిస్తున్నాడు. 70.80 సగటుతో పరుగులు చేస్తున్నాడు. అతడు స్పిన్ బౌలర్ల బౌలింగ్లో ఐదు సార్లు అవుట్ అయ్యాడు. గిల్ 56.10 సగటుతో పదిసార్లు స్పిన్ బౌలర్ల చేతిలో అవుట్ అయ్యాడు.. ఇక రేపటి నుంచి బంగ్లాదేశ్ జట్టుతో భారత్ టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ జట్టు ఇప్పటికే పాకిస్తాన్ ను వారి స్వదేశంలో 2-0 తేడాతో ఓడించింది. టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు స్పిన్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 69 మ్యాచ్లలో 242 వికెట్లు పడగొట్టాడు. మెహదీ హసన్ 45 మ్యాచ్లలో 174 వికెట్లు సొంతం చేసుకున్నాడు. టైజుల్ ఇస్లాం 46 మ్యాచ్లలో 195 వికెట్లు పడగొట్టాడు. కాబట్టి టీమిండియా ఈ బౌలర్లతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గత కొంతకాలంగా స్వదేశంలో స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో విఫలమవుతున్న విరాట్, రోహిత్ శర్మ మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఇబ్బంది పడక తప్పదు.