Virat Kohli: విరాట్ కోహ్లీ షాకింగ్ పోస్టులు.. నెటిజన్ల సెటైర్లు.. అసలేమైంది?

మ్యాచ్ నాలుగో రోజు ముగిసిన తర్వాత కోహ్లీ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్టు సారాంశం ఏమిటంటే.. ఒక్కోసారి అన్ని వదిలేయడం కూడా నేర్చుకోవాలి అంటూ హితబోధ చేసేలా ఆ పోస్ట్ ఉంది.

Written By: BS, Updated On : June 16, 2023 12:18 pm

Virat Kohli

Follow us on

Virat Kohli: డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత జట్టు ఘోర పరాభవం తర్వాత.. ఆటగాళ్లంతా తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు కీలక ప్లేయర్లను ఒక ఆట ఆడుకుంటున్నారు. ద్వైపాక్షిక సిరీస్ ల్లో అదరగొట్టడం, కీలకమైన టోర్నీలో చేతులెత్తేయడం భారత జట్టుకు అలవాటుగా మారింది అంటూ మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీపై కూడా విమర్శలు వస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్ లో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో రహానేతో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే క్రమంలో కోహ్లీ మెరుగైన ఆట తీరు కనబరుస్తున్నాడు. అయితే, నిర్లక్ష్యంగా ఆడిన షాట్ తో వికెట్ సమర్పించుకొని కోహ్లీ విమర్శలకు గురయ్యాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లో అవుట్ అయిన తీరు అనేక విమర్శలకు తావిచ్చింది. ముఖ్యంగా, కోహ్లీ అనవసరమైన షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడని మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్ తో పాటు, వసీం జాఫర్ కూడా విమర్శించాడు. అయితే, ఈ తరహా విమర్శలు వస్తున్న క్రమంలోనే కోహ్లీ ట్విట్టర్ వేదికగా మ్యాచ్ జరిగిన నాలుగో రోజు కొన్ని పోస్టులను పెట్టాడు. తాజాగా అదే విధమైన పోస్టును కోహ్లీ పెట్టడంతో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

నాలుగో రోజు మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెట్టిన పోస్ట్ ఇదే..

మ్యాచ్ నాలుగో రోజు ముగిసిన తర్వాత కోహ్లీ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్టు సారాంశం ఏమిటంటే.. ఒక్కోసారి అన్ని వదిలేయడం కూడా నేర్చుకోవాలి అంటూ హితబోధ చేసేలా ఆ పోస్ట్ ఉంది. అయితే, తాజాగా అటువంటి మరో కొటేషన్ ను ట్విట్టర్లో షేర్ చేశాడు. దీనిలో మార్పు గురించి కోహ్లీ ప్రస్తావిస్తూ పోస్ట్ చేయడం గమనార్హం. ఈ పోస్టులో ఏముందంటే.. మార్పును సరిగా అర్థం చేసుకోవాలంటే దానిలో దూకాలని, దానితోపాటు నడవాలని, చివరకు ఆ మార్పుతో కలిసి డ్యాన్స్ కూడా చేయాలనే అర్థం వచ్చేలా పోస్టును కోహ్లీ షేర్ చేశాడు. అలన్ వాట్స్ కు సంబంధించిన కొటేషన్ గా దీన్ని చెబుతున్నారు.

కోహ్లీ పోస్టులను ఎగతాళి చేస్తున్న అభిమానులు..

విరాట్ కోహ్లీ ఈ తరహా పోస్టులను ఎందుకు చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే, కోహ్లీ చేస్తున్న పోస్టులపై కొందరు ఫ్యాన్స్ మాత్రం పెద్ద ఎత్తున ఎగతాళి చేస్తున్నారు. ముఖ్యమైన టోర్నీల్లో ఆడడం చేతకాదు కానీ, ఈ తరహా నీతులు చెప్పడానికి మాత్రం ముందుంటాడు అంటూ పలువురు విమర్శిస్తున్నారు. మరి కొంతమంది అయితే కోహ్లీ ఈ తరహా పోస్ట్లు పెట్టడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని చెబుతున్నారు ఏదో జరగడం వల్లే కోహ్లీ ఇలా చేస్తున్నాడని పలువురు పేర్కొంటున్నారు.