Virat Kohli Net Worth: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఏ రేంజిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడితే ఇక ఆటగాడికి ఊహించనంతగా గుర్తింపు వస్తుంది. అంతే కాదు ఒక్క మ్యాచ్లో అద్భుతంగా రాణిస్తే క్రికెట్ ప్రపంచం మొత్తం అతన్ని ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేస్తుంది. ఇలా ఇటీవలి కాలంలో క్రికెటర్లు ఎవరికీ సాధ్యం కానంత గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన క్రికెటర్ల సంపాదన కూడా అంతకంతకూ పెరుగుతోంది. క్రికెట్ బోర్డులు ఇచ్చే వేతనాన్ని మించి వాణిజ్య ప్రకటనల ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. దీంతో అత్యంత ధనవంతులుగా మారిపోతున్నారు.
కళ్లు చెదిరేలా కోహ్లీ
పరుగుల వీరుడు, రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. సోషల్‌మీడియాలో అతడికి ఫాలోవర్లూ ఎక్కువే. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే అతడికి 252 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక అత్యంత విలువైన ఈ ఆటగాడి నికర ఆస్తులు.. రూ.వెయ్యి కోట్ల పైనే ఉంటాయట. ‘స్టాక్ గ్రో’ అనే కంపెనీ గణాంకాల ప్రకారం.. అతడి నికర ఆస్తుల విలువ రూ.1050 కోట్లు అని తెలిపింది. అంతర్జాతీయ క్రికెటర్లు ఆర్జిస్తున్న ఆదాయం పరంగా చూసుకున్నా ఇదే ఎక్కువ.
ఆదాయం ఇలా..
కోహ్లీకి టీమిండియా ‘A+’ కాంట్రాక్ట్ ద్వారా బీసీసీఐ నుంచి రూ.7 కోట్లు లభిస్తాయి. ప్రతీ టెస్టుకు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షలు తీసుకుంటాడు. ఇక ఐపీఎల్ ద్వారా ఆర్సీబీ జట్టుకు ఆడటం ద్వారా అతడు ఏడాదికి రూ.15 కోట్లు సంపాదిస్తున్నాడు. కోహ్లీకి సొంతంగా చాలా బ్రాండ్లు ఉన్నాయి. బ్లూట్రైబ్, యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్, ఎంపీఎల్, స్పోర్ట్స్ కాన్వో లాంటి ఏడు స్టార్టప్స్‌లో అతడు పెట్టుబడి పెట్టాడు. విరాట్ దాదాపు 18 బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఒక్కో యాడ్‌లో నటించేందుకు రూ.7.50 కోట్ల నుంచి రూ.10 కోట్లు ఛార్జ్ చేస్తాడు. అలాంటి వాటి ద్వారానే రూ.175 కోట్లు సంపాదిస్తున్నాడు.
– సోషల్‌మీడియాలో కోహ్లీకున్న క్రేజ్ తెలిసిందే. ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు రూ.8.9 కోట్లు ఛార్జ్ చేస్తుండగా.. ట్విటర్‌లో ఒక్కో పోస్టుకు రూ.2.5 కోట్లు వసూలు చేస్తున్నాడు.
– కోహ్లీకి రూ.34 కోట్ల విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ముంబయిలో ఉంది. రూ.80 కోట్ల విలువ చేసే మరో నివాసం గురుగ్రామ్‌లో ఉంది. రూ.31 కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇవే కాకుండా.. కోహ్లీకి ఎఫ్‌సీ గోవా ఫుట్‌బాల్ క్లబ్, ఓ టెన్నిస్ జట్టు, ప్రో రెజ్లింగ్ జట్టు ఉన్నాయి.
తర్వాతి స్థానాల్లో ధోనీ, రోహిత్..
ఇలా క్రికెట్లోనే కాదు అటు సంపాదనలో కూడా నంబర్ వన్ స్థానంలో కోహ్లీ కొనసాగుతున్నాడు. తర్వాత మహేంద్రసింగ్ ధోని రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ధోని వార్షిక ఆదాయం 108.28 కోట్లు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా ఇప్పటికీ అనేక వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నాడు.టీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్శర్మ రూ.74.49 కోట్లు ప్రతి ఏడాది సంపాదిస్తాడట. టీమిండియా యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా రూ.59.9.. స్టివ్ స్మిత్ రూ.55.86 కోట్లు. జస్ప్రిత్ బూమ్రా రూ.31.65 కోట్లు, సురేశ్‌రైనా రూ.22.24 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది సంపాదిస్తారట.