Virat Kohli : ఆధునిక క్రికెట్లో సచిన్ తర్వాత ఆ స్థాయిలో పేరును సంపాదించుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర పుటల్లో నిలిచాడు. సచిన్ తర్వాత ఆ స్థాయిలో పరుగులు సాధిస్తున్న ఆటగాడిగా పేరు సాధించాడు. అయితే గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ సరైన ఫామ్ లో లేడు. అయినప్పటికీ అత్యధికంగా సంపాదిస్తున్న ప్లేయర్ల జాబితాలో అతడి పేరు టాప్ -3 లో కొనసాగుతోందంటే అతడి బ్రాండ్ వాల్యూ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందువల్లే అతడిని ఈ కాలపు రన్ మిషన్ మాత్రమే కాదు, ఎర్నింగ్ మిషన్ అని కూడా స్పోర్ట్స్ ఎక్స్ పర్ట్స్ చెబుతుంటారు. ” అతడు సమ్మోహన రూపుడు. అందువల్లే క్రికెట్ తో పాటు భారీగా సంపాదిస్తున్నాడు. తన తోటి ఆటగాళ్లకు సాధ్యం కానీ రికార్డులను సృష్టిస్తున్నాడని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు..
ఇటీవల కాలంలో సరైన ఫామ్ లో లేకపోయినప్పటికీ విరాట్ కోహ్లీ నామస్మరణ ఏమాత్రం ఆగడం లేదు. సోషల్ మీడియా నుంచి మీడియా వరకు ఇదే వరస. ఇక ఇప్పుడు ఈ జాబితాలో ముఖ్యమంత్రులు కూడా చేరిపోయారు. తాజాగా తెలుగు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు విరాట్ కోహ్లీని అభినందనలతో ముంచెత్తారు. ఇప్పుడు ఈ జాబితాలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా చేరిపోయారు. విరాట్ కోహ్లీ ఒకప్పుడు తన దూకుడైన ఆటతీరుతో యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అదే ఆటను చాలా కాలం పాటు కొనసాగించాడు. ఇప్పుడు కొంతకాలంగా ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్నాడు. దానిని అందిపుచ్చుకోవడానికి అతని ప్రయత్నాలు చేస్తున్నాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తో సిరీస్ లలో అతడు తీవ్రంగా విఫలమయ్యాడు. త్వరలో అతడు రంజీలో బరిలోకి దిగనున్నాడు. అయితే మెడ నొప్పితో తొలి మ్యాచ్ ఆడలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ తన పూర్వపు ఫామ్ అందుకోవడానికి విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
ఇక ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తనకి ఇష్టమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ అని చెప్పడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ” విరాట్ కోహ్లీ నా ఆరాధ్య ఆటగాడు. ఆడే ఆట బాగుంటుంది. అతని దూకుడు తనం నాకు చాలా ఇష్టం. మైదానంలో అతడు అత్యంత చురుకుగా ఉంటాడని” మోహన్ యాదవ్ వ్యాఖ్యానించాడు. ఇక ఇటీవల దావోస్ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ తో పోటీ గురించి ప్రశ్న ఎదురైనప్పుడు.. ” మాకు ఎందుకు పోటీ ఉంటుంది. ఎవరితో పోటీ ఉంటుంది. సచిన్, సునిల్ గవాస్కర్ లాంటివాళ్ళు లెజెండరీ ఆటగాళ్లు. కానీ ఇప్పుడు టైం చేంజ్ అయింది. ఈ జమానా మొత్తం విరాట్ కోహ్లీది. అలాంటప్పుడు అతడు ఎలా ఆడాలో చూపించలేడా అంటూ” రేవంత్ పేర్కొన్నారు.. గతంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆహా అన్ స్టాపబుల్ టాక్ షోలో విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. అతడి ఆట తీరు నాకు చాలా ఇష్టమని ప్రశంసలు జల్లు కురిపించారు. ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులు విరాట్ కోహ్లీ నామస్మరణ చేయడాన్ని అతడి అభిమానులు గొప్పగా భావిస్తున్నారు.