Virat Kohli : సుదీర్ఘ ఫార్మాట్లో యువరత్నాన్ని ఎక్కించడానికి మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంలో భాగంగానే గిల్ కు సారధ్య బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. గత కొంతకాలంగా టీమిండియా అంతగా ఆశించిన స్థాయిలో టెస్ట్ విజయాలను సొంతం చేసుకోలేకపోతోంది. ముఖ్యంగా స్వదేశంలో కివీస్ చేతిలో దారుణమైన ఓటమిని ఇండియా మూటకట్టుకుంది. ఆ తర్వాత కంగారులతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లోనూ అదే ఫలితం రిపీట్ అయింది. మొత్తంగా రెండు మేజర్ టోర్నీలలో టీమిండియా ఓడిపోవడం సగటు టెస్ట్ అభిమానిని జీర్ణించుకోలేకుండా చేసింది. ఇది ఒక రకంగా టీమ్ ఇండియాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కు దూరం చేసింది. గత రెండు సీజన్లలో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లినప్పటికీ.. ఒక్కసారి కూడా విజేత కాలేకపోయింది. ఒక పర్యాయం కివిస్ చేతిలో.. మరొక పర్యాయం కంగారుల చేతిలో భారత్ ఓటమిపాలైంది. వాస్తవానికి మిగతా వన్డే, టి20 ఫార్మాట్లో టీమ్ ఇండియాకు తిరుగులేదు. అనితర సాధ్యమైన విజయాలను టీమిండియా ఈ ఫార్మాట్ లలో సొంతం చేసుకుంది. ఇక ఇటీవలి సిరీస్లలో టీమిండియా ఏకపక్ష విజయాలు సాధించి.. తనకు తానే సాటి అని నిరూపించుకుంది. అందువల్లే మేనేజ్మెంట్ సుదీర్ఘ ఫార్మాట్లో జట్టు కూర్పు విషయంలో తీవ్రమైన కసరత్తు చేసినట్టు కనిపిస్తోంది.. అయితే ఇక్కడే ఒక చిన్న అంశం టీమిండియాను ఎంపిక చేసిన తీరు చర్చనీయాంశంగా మార్చింది.
Also Read : ప్లే ఆఫ్ టీమ్ లు మొత్తం ఓడిపోతున్నాయి..టాప్ -2 నిలిచేందుకు ఏం చేయాలంటే?
ఇంగ్లీష్ జట్టుతో సిరీస్ కంటే ముందు విరాట్ కోహ్లీ తనకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అయితే యువ రక్తాన్ని ఎక్కించే క్రమంలో మేనేజ్మెంట్ కోహ్లీ నిర్ణయాన్ని తప్పు పట్టింది. దీంతో అతడు సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టుతో త్వరలో ప్రారంభమయ్యే సిరీస్ కోసం టీం ఇండియాను ఎంపిక చేసిన మేనేజ్మెంట్.. మొత్తం 18 మంది ఆటగాళ్లకు స్థానం కల్పించింది. ఇందులో కులదీప్, గిల్, బుమ్రా, రాహుల్, రవీంద్ర జడేజా, సిరాజ్, రిషబ్ పంత్ ను మినహాయిస్తే.. మిగతా ప్లేయర్లు మొత్తం తక్కువ అనుభవం ఉన్నవారే. ఇక ఇటీవల సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ 30 సెంచరీలు చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. ఏకంగా దిగ్గజ ప్లేయర్ల సరసన నిలిచాడు. అయితే ప్రస్తుతం జట్టులో మిగతా ప్లేయర్ల సెంచరీల సంఖ్య మొత్తం 29 మాత్రమే కావడం విశేషం. ఇక ఇంగ్లాండ్ క్రికెటర్ రూట్ మాత్రం ఒక్కడే 36 సెంచరీలు చేశాడు.
” విరాట్ కోహ్లీ కనక ఈ సిరీస్ లో ఉండి ఉంటే మరో విధంగా సాగి ఉండేది. కాకపోతే అతడు వీడ్కోలు తీసుకున్న తర్వాత ఆస్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ ఆ స్థానంలో ఏ ఆటగాడికి అవకాశం లభించినప్పటికీ.. కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని కనుక జయించినట్లయితే తిరుగు ఉండదు. ఈ విషయంలో మేనేజ్మెంట్ ఎలా ఆలోచిస్తుందో తెలియదు. మొత్తానికైతే ఇంగ్లీష్ జట్టుతో తలపడే టీం యువ రక్తంతో తొణికి సలాడుతున్నప్పటికీ.. తదుపరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉందని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు..
ఇక ఇంగ్లీష్ జట్టులో కొంతమంది ప్లేయర్లు గత సిరీస్ లలో గొప్పగా ఆడినప్పటికీ.. టీమిండియా ఎదుట ఆ స్థాయిలో రాణిస్తారు అని అనుమానం కలుగుతోంది. మరోవైపు 2007 తర్వాత ఇప్పటివరకు ఇంగ్లీష్ జట్టుపై టీమ్ ఇండియా ఒక్క సిరీస్ విజయాన్ని కూడా అందుకోలేదు.