Virat Kohli: టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సంచలనం సృష్టించాడు. అయితే ఈసారి తన ఆట ద్వారా కాదు, తను చేసిన ప్రకటన ద్వారా. వాస్తవానికి విరాట్ కోహ్లీ నుంచి ఇటువంటి ప్రకటన వస్తుందని మేనేజ్మెంట్ అంచనా వేయలేదు. తోటి ఆటగాళ్లు కూడా ఊహించలేదు. విరాట్ కోహ్లీ ఇటీవల రాంచీ వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేశాడు. ఈ సందర్భంగా ఫామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.. ఫామ్ అందుకోవడానికి తను పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఆటగాళ్లు ఫామ్ అందుకోవడానికి డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఇటీవల బీసీసీఐ నిబంధన విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రాంచి వన్డే లో గెలిచిన తర్వాత ఫామ్ గురించి.. తాను డొమెస్టిక్ క్రికెట్ ఆడే విధానం గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో విరాట్ మేనేజ్మెంట్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని వార్తలు వినిపించాయి. విరాట్ పరోక్షంగా ఆ వ్యాఖ్యలు చేయడం మేనేజ్మెంట్ ను సవాల్ చేసినట్టేనని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
మొన్నటి వ్యాఖ్యలు జాతీయ మీడియాలో ప్రధానంగా చర్చకు రావడంతో విరాట్ కోహ్లీ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు ఫామ్ అందుకోవడానికి డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని మేనేజ్మెంట్ నిబంధన విధించిన నేపథ్యంలో దానికి తన అంగీకారాన్ని విరాట్ వ్యక్తం చేశాడని తెలుస్తోంది. ఎందుకంటే ఈనెల 24 నుంచి జరిగే డొమెస్టిక్ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి తాను అందుబాటులో ఉంటానని విరాట్ పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని ఢిల్లీ జట్టుకు అతడు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఢిల్లీ క్రికెట్ సంఘ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ధృవీకరించారు. విజయ్ హజారే ట్రోఫీకి విరాట్ అందుబాటులో ఉంటాడని పేర్కొన్నారు. అయితే విరాట్ ఎన్ని మ్యాచ్లు ఆడతారనే విషయంపై తనకు క్లారిటీ లేదని జైట్లీ పేర్కొన్నారు.
విరాట్ డొమెస్టిక్ క్రికెట్ ఆడటం వల్ల ఢిల్లీ జట్టుకు బలం పెరుగుతుందని.. ప్లేయర్లకు ఉత్సాహాన్ని ఇస్తుందని రోహన్ అభిప్రాయపడ్డారు. టి20 లు, టెస్ట్ ఫార్మాట్ నుంచి శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్న విరాట్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రం కొనసాగుతున్నాడు. అతడు తన కుటుంబంతో లండన్ లో నివాసం ఉంటున్నాడు. ఈనెల ఆరవ తేదీతో దక్షిణాఫ్రికా జట్టుతో వన్డే సిరీస్ ముగుస్తుంది. అనంతరం విరాట్ లండన్ వెళ్లిపోతాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం కొద్ది వారాల తర్వాత మళ్లీ ఇండియాకు విరాట్ కోహ్లీ వస్తాడు. ఆ టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ మైదానంలో కనిపించేది కేవలం ఐపిఎల్ లో మాత్రమే.