IPS Sunil Kumar: ఏపీలో ఆసక్తికర చర్చ ఒకటి జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి దళితులు, కాపులు ఇస్తే రాజ్యాధికారం తప్పదని సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్( IPS officer Sunil Kumar) వ్యాఖ్యానించారు. అయితే ఇది వినేందుకు శ్రావ్యంగా ఉన్న.. ఆచరణ సాధ్యమేనా అన్న చర్చ నడుస్తోంది.. పైగా పీవీ సునీల్ కుమార్ మాటలకు అర్ధాలే వేరు అన్నట్టు ఉంది పరిస్థితి. ఎందుకంటే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారి అని ఒక ముద్ర. ఆపై కాపులు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారని కూడా ఆయనకు తెలుసు. అన్నింటికీ మించి దళితులు రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా చీలిపోయారు అన్న విషయం ఆయనకు తెలియంది కాదు. అయినా సరే ఈ వ్యాఖ్యలు చేశారంటే ఏదో వ్యూహం ఉన్నట్టు మాత్రం అర్థమవుతోంది.
* ఇంచుమించు సమానంగా..
ఉమ్మడి ఏపీలో కానీ.. నవ్యాంధ్రప్రదేశ్లో కానీ కాపు సామాజిక వర్గం సంఖ్య అధికం. దాదాపు రాష్ట్రంలో జనాభాలో 18% కాపు సామాజిక వర్గం ఉంటారన్నది 2011 జనాభా లెక్కల ప్రకారం తేలిన అంశం. అయితే ఈ 14 సంవత్సరాల్లో వారి సంఖ్య మరింత పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించి ఉభయగోదావరి, విశాఖ, కృష్ణ, నెల్లూరు జిల్లాలో కాపులు ఎక్కువగా ఉంటారు. మిగతా రాష్ట్రాల్లో సైతం గణనీయంగా ఉన్నారు. తూర్పు, గాజుల కాపులను కలుపుకుంటే ఈ జనాభా శాతం మరింత అధికం. అయితే ఎస్సీల సంఖ్య కూడా అదే రీతిలో ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో వారి శాతం 16.5. అంటే ఇంచుమించు కాపులతో సమానంగా ఉంటారు దళితులు.
* ఎస్సీల్లో చీలిక..
కాపులు ఎప్పటికప్పుడు తమ రాజకీయ మద్దతును మార్చుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమికి అండగా ఉంటున్నారు.. దళితుల విషయానికి వస్తే మెజారిటీ ప్రజలు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. కాపులతో పోల్చుకుంటే దళితుల్లో చీలిక ఉంది. దశాబ్దాలుగా ఎస్సీల్లో రిజర్వేషన్ పోరాటం నడిచింది. ఆ సామాజిక వర్గాల్లో చీలిక స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు వారంతా ఏకతాటి పైకి వస్తారా? అన్నది అనుమానం. ఎస్సీల్లో రిజర్వేషన్ ఉద్యమాల కోసం ప్రత్యేక సంస్థలు పుట్టాయి. వారు రాజకీయ పార్టీల కంటే ఆ సంస్థలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు. వారంతా ఏకతాటి పైకి రావడం అనేది చాలా కష్టం అన్నది విశ్లేషకుల మాట. ఒకవేళ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ చెబుతున్న మాటను అనుసరిస్తే మాత్రం.. ముందుగా ఎస్సీల్లో ఉన్న చీలికను అధిగమించి వారిని ఏకతాటి పైకి తేవాలి. ఆపై కాపులతో కలిపే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే మాత్రం ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఆలోచన కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.